ఐపీఎల్ 2026 సీజన్ మొదలై అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్‌లు ఆడేసింది. కానీ కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఆ ఒక్క రూపం మాత్రం ఇంకా మైదానంలో కనిపించలేదు. తనే.. మన తలా ఎంఎస్ ధోనీ. అయితే, ముంబై ఇండియన్స్ తో జరగబోయే కీలక పోరుకు ముందు ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ధోనీ రీఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా అయితే ఎంఎస్ ధోనీ నెట్స్‌లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం చాలా అరుదు. ఆయన ఎక్కువగా బ్యాటింగ్ లేదా సరదాగా బౌలింగ్ చేస్తూ కనిపిస్తారు. కానీ, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ వికెట్ కీపింగ్ గ్లోవ్స్ ధరించి ప్రాక్టీస్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబై మాజీ ప్లేయర్ ఆదిత్య తారే దీని మీద స్పందిస్తూ.. "నేను ధోనీని నెట్స్‌లో కీపింగ్ చేయడం ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా షాకింగ్. బహుశా ఆయన తన మ్యాచ్ ఫిట్నెస్ను పరీక్షించుకుంటున్నట్లు ఉన్నారు." అని పేర్కొన్నారు. ఇది సీఎస్కే శిబిరంలో గుడ్ సిగ్నల్స్ పంపుతోంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ధోనీ కాఫ్ ఇంజూరీ (పిక్క గాయం) బారిన పడ్డారు. దీనివల్ల సీజన్ లో మొదటి 6 మ్యాచ్‌లకు ఆయన దూరమయ్యారు. ధోనీ లేకపోవడం వల్ల చెన్నై జట్టు 6 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. జట్టులో గేమ్ అవేర్నెస్ లోపించిందని, క్లిష్ట సమయాల్లో ధోనీ వంటి సీనియర్ అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో, ఏప్రిల్ 23న ముంబైతో జరిగే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం ఖాయమనిపిస్తోంది. గడిచిన రెండు సీజన్లలో ధోనీ లోయర్ ఆర్డర్ (నంబర్ 7 లేదా 8) లో వచ్చి మెరుపులు మెరిపించారు. 2024 ఐపీఎల్లో 161 పరుగులు చేసిన ఆయన, 2025 సీజన్లో 14 మ్యాచ్‌లలో 196 పరుగులు సాధించారు. స్ట్రైక్ రేట్ విషయంలో యువకుల కంటే బెటర్ గా ఉండటం ఆయన ప్రత్యేకత. ఈ ఏడాది కూడా అదే దూకుడును కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై ధోనీకి మంచి రికార్డు ఉండటం ప్లస్ పాయింట్. ఐపీఎల్లో ముంబై, చెన్నై మ్యాచ్ అంటేనే ఒక ఎల్ క్లాసికో. ఇరు జట్లు చెరో ఐదుసార్లు టైటిల్ గెలిచాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో చెన్నై వెనుకబడి ఉన్న తరుణంలో, ధోనీ రాక జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ధోనీ సలహాలు జట్టుకు కొండంత బలాన్ని ఇస్తాయి. రేపటి మ్యాచ్ లో ధోనీ టాస్ సమయానికి జట్టులో ఉంటారా లేదా అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న.