నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడి తీవ్ర వాయుగుండంగా మొదలైన వాతావరణ వ్యవస్థ ఇప్పుడు తుఫాన్‌గా మారింది . ఇది ‘దిత్వా’ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు ముప్పుగా మారింది. యెమెన్ సూచించిన ఈ పేరుతో నమోదైన దిత్వా ప్రస్తుతం బట్టికాలోవా (శ్రీలంక)కు సుమారు 20 కి.మీ, పుదుచ్చేరికి 520 కి.మీ, చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది . ఇప్పుడు దిత్వా ఉత్తర–వాయవ్య దిశగా కదులుతోంది. తొలి అంచనాల ప్రకారం చెన్నై–పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావించినా, తాజా సూచనల్లో తీరం వెంట ప్రయాణిస్తూ క్రమంగా బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో వర్షాలు, గాలుల ప్రభావం
దిత్వా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అండమాన్–నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం కొన్నిజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదివారం మరికొన్నింటికి రెడ్ అలర్ట్ ప్రకటించగా, కోస్తా తీరం వెంట శని–ఆది రోజుల్లో గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని సూచిస్తున్నారు.
మత్స్యకారులు, తీరప్రాంత ప్రజల కోసం సూచనలు
దిత్వా కారణంగా సముద్రం ఉద్ధృతంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వెళ్లకూడదని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉండగా, తక్కువ ఎత్తున్న తీరప్రాంత గ్రామాల్లో ఉండే ప్రజలు వర్షాలు, బలమైన గాలులు తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తే వెంటనే సమీపంలోని సురక్షిత కేంద్రాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఇళ్లలో ఉండే వారు అవసరమైన త్రాగునీరు, డ్రై ఫుడ్, టార్చ్ లైట్స్, మొబైల్ పవర్ బ్యాంక్‌లు సిద్ధం చేసుకోవాలని, విద్యుత్ తీగలు, చెట్ల క్రింద నిల్చోవడం, వరద నీటిలో ప్రయాణించడం వంటి ప్రమాదకర చర్యలను పూర్తిగా నివారించాలని సూచనలు జారీ అయ్యాయి.