కిల్లర్ పార్టీ నేతల కొత్త ఎత్తుగడలు
వారి వ్యూహాలకు తగ్గట్లుగా ఉండాల్సిందే
ఎంతటి దారుణాలకైనా తెగించేస్తున్నారు
క్లస్టర్ ఇన్ చార్జ్‌తో పార్టీ అధినేత చంద్రబాబు
వైసిపి రాజకీయ కుట్రలతో అప్రమత్తంగా ఉండాలని టిడిపి శ్రేణులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు అందరూ జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కిల్లర్ పార్టీ ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోందని.. వారి ఆగడాలు చెల్లనివ్వమని హెచ్చరించారు. జగన్ అండ్ కో రోడ్ల మీదకు వస్తారని, రెచ్చగొడతారని, రప్పా రప్పా అంటారని, ప్రజలను ఇబ్బందులు పెడతారని, చర్యలు తీసుకుంటే రాజకీయ కక్ష అంటారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్చార్జ్ శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. శిక్షణా తరగతులకు వచ్చిన క్లస్టర్ ఇన్చార్జ్ లతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించి.. వారికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశర చేశారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల వంటి అంశాలపై సీఎం చంద్రబాబు మార్గనిర్దేశర చేశారు. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని... కేడర్ దాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సమకాలీన రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీఎం దిశానిర్దేశర చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరించారు. ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్స్ రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన పెద్ద దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. తన జీవితంలో ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాను తప్ప... నేరగాళ్లతో ఏనాడూ పోరాడలేదని.. ఇది తనకు కొత్తగా ఉందని తెలిపారు. వైసీపీ సోషల్ సైకోలతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ లాంటి పార్టీని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని గొడ్డలి పార్టీ ఎమ్మెల్సీ హత్య చేశారని.. కోర్టులో సాక్ష్యం చెప్పిన వారిని కూడా బెదిరించారని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ చేసే అరాచకాలను అనునిత్యం ప్రజలకు కేడర్ వివరిస్తూనే ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. 2019లో వైసీపీ గెలిచాక ఏపీలో అభివృద్ధి జరగలేదని ప్రస్తావించారు. తనను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను కాపాడుకున్నానని స్పష్టం చేశారు. రాజకీయాలను దాటి సామాన్య ప్రజలను కూడా జగన్ హయాంలో ఇబ్బందులకు గురి చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాలని అన్నారు. మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతోపాటు.. కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టలను ప్రజలకు వివరించాలని సూచించారు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలని.. పార్టీ కూడా కార్యకర్తలను అలాగే గౌరవిస్తోందని స్పష్టం చేశారు. అన్యాయం జరిగిందని జగన్ రెడ్డి పరామర్శకు వెళ్తారని... కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపేస్తారని... కానీ తన కారు కింద పడిపోయిన కార్యకర్తను మాత్రం ఎందుకు పరామర్శించరని ప్రశ్నించారు. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని ఆరోపించారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను దోపిడీ చేశారని ఆగ్రహించారు. పంపకాల్లో విభేదాలు రావడంతో దస్తగిరి అనే వైసీపీ కార్యకర్తను చంపేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వాళ్ల అనుచరులను వాళ్లే చంపుకుని నేరం తమపై నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలయ్యేదాకా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను వాడుకున్నారని... అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని జగన్ చెల్లెలు వైఎస్ సునీతారెడ్డి అడిగితే సైలెంట్‌గా ఉండమని ఆమెను కూడా బెదిరించారని ఆగ్రహించారు. ఆస్తి విషయంలో తల్లి, చెల్లిపై ఎవరైనా కోర్టుకు వెళ్తారా..? అని మండిపడ్డారు.