'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు 'పుష్ప2', 'ఓజీ', గేమ్ ఛేంజర్', 'అఖండ 2' చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో తాజా చిత్రాల నిర్మాతలకు ఊరట లభించినట్లయ్యింది. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు వేశారు. టికెట్ ధరలు పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన తీర్పును ఆ చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ది రాజాసాబ్' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న విడుదల కానుంది. హైకోర్టు ఉత్తర్వులతో 'ది రాజాసాబ్' బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.