ఇరుసుమండలో ఓఎన్జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ గాలిలోకి ఎగజిమ్మడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది చూసి గ్రామస్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మండల తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పని మొదలు పెట్టారు. మలికిపురం మండలంలో గ్యాస్ లీకేజ్ విషయంపై మంత్రి సుభాష్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే మంటలను అదుపు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ఆగస్టులోనూ ఇదే గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ అయ్యింది. ఇక్కడ తరుచూ గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు జరుగుతుండడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా దీని వల్ల తీవ్ర ప్రమాదం జరగొచ్చని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని.. లేదంటే గ్రామ ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓఎన్జీసీ సిబ్బంది ఇంజన్లతో మంటలు కంట్రోల్ చేస్తున్నారు.
గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు ఆరా
తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ విషయంపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. తాము ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడామని.. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని సూచించినట్లు సీఎంకు మంత్రులు వివరించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని... సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంటలను వెంటనే అదుపులోకి తెచ్చేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కాగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ అవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేశ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితిపై అధికారులతో ఉండాలని సూచనలు చేశారు. కలిసి సమీక్ష జరిపారు. భద్రతా చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసారు.