95 శాతం అదుపులో ఉన్నట్లు వెల్లడి నిరంతరం నీటిని చిమ్మే ప్రయత్నం
అదుపులోకి రావడానికి మరో ఐదు రోజులు.. ఓఎన్బీసీ అధికారుల వెల్లడి
అంబేడ్కర్ కోనసీమ : ఇరుసుమండ బ్లోఔట్‌లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఓఎన్సీసీ సిబ్బంది శాయశక్తుల కృషి చేస్తున్నారు. దీనిపై డీప్ ఇండస్టీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న మోరి - 5 వెల్ ఫీల్డ్స్్ప ఓఎన్బీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ విక్రమ్ సక్సెనాతో సహా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ మేనేజ్మెంట్, కైస్రిస్ మేనేజ్మెంట్ టీమ్ నిపుణులతో కలిసి ఈ మంటలను నియంత్రించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు వివరించింది. అధిక సామర్థ్యం ఉన్న వాటర్ పంపులను వినియోగించి.. సమీపంలోని నీటిపారుదల వనరుల నుండి తాత్కాలిక కాలువను రూపొందించడానికి పనులు చేపట్టినట్లు తెలిపింది. అందుకోసం సమగ్ర బ్లో అవుట్ నియంత్రణ ప్రణాళికను ఖరారు చేసినట్లు పేర్కొంది. అగ్నికీలల తీవ్రతను తగ్గించేందుకు నిపుణుల బృందం పని చేస్తోందని తెలిపింది. 600 మీటర్ల వ్యాసార్ధంలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి గాలి నాణ్యత, శబ్ద స్థాయిలను బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని ఓఎన్జీసీ వెల్లడించింది. ఇంకోవైపు ఈ మంటలను గూడవల్లి పంట కాల్వ నుంచి పైపుల ద్వారా నీటిని మళ్లించి మంటలను అదుపుచేస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురంలోని ఓఎన్ జీసీ బృందాలు రంగంలోకి దిగాయి. బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలను ఓఎన్ జీసీ బృందం ముమ్మరం చేసింది. ఎగసిపడుతున్న అగ్నికీలలు కొంత మేర తగ్గాయని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. బ్లోఔట్ ప్రదేశానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే.. ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరు బాధ్యులనే అంశంపై చర్యలు చేపట్టనున్నారు. బ్లోఅవుట్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఓఎన్జీసీ టెక్నికల్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బ్లోఅవుట్ కట్టడి చర్యలు, భద్రతా పరిస్థితులపై స్పష్టత ఇచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమలోని గ్యాస్ బ్లోఅవుట్ మరో ఐదు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పటికే 95 శాతం బ్లోఅవుట్ను విజయవంతంగా కట్టడి చేశామని, మిగిలిన గ్యాస్‌ను క్యాపింగ్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.. అయితే, బ్లోఅవుట్ కొనసాగినా ఎలాంటి ప్రాణహాని, ప్రమాదం ఉండదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని విక్రమ్ సక్సేనా తెలిపారు. గ్యాస్ లీక్ ప్రాంతంలో ప్రస్తుతం వాటర్ అంబ్రెల్లా భద్రతా విధానం అమలు చేస్తున్నామని, ఐదు వైపులా నిరంతరం నీరు చిమ్ముతూ మంటలు చెలరేగకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. భూభాగంలో మిగిలిన గ్యాస్‌ను పూర్తిగా నియంత్రించేందుకు రోజుకు అనేక టెక్నికల్ పరిశీలనలు, నిపుణుల సూచనలతో క్యాపింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఇక, ఈ ఘటనలో పక్రియ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఒక్క ప్రాణి కూడా ప్రమాదానికి గురికాలేదని అధికారులు ధృవీకరించారు. బ్లోఅవుట్ కారణంగా కాలిపోయిన కొబ్బరి చెట్లు, దెబ్బతిన్న పంట భూములకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మరో ఏడు రోజులు పాటు ఐదు వైపులా నీటిని చిమ్మే రక్షణ చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం, ఓఎన్జీసీ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర విభాగాలు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం 95శాతం కట్టడి కావడంతో ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు అధికారులు..
బ్లోఅవుట్ పై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. బ్లో అవుట్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యల ను సీఎస్ విజయానంద్, హోంమంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు, సీఎంవో సహా ఇతర అధికారులు వివరించారు. ప్రమాద స్థలంలో ప్రస్తుత పరిస్థితి, ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు అందుతున్న సహాయ చర్యల పైనా అధికారులతో సీఎం మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతారని... వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని సూచించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇళ్లు, ఊళ్లు వదలిన వారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని చెప్పారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి, ఇతరత్రా నష్టం జరిగిన వారికి నష్టపరహారం అందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని సూచనలు చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి తరహా ఘటనలు తలెత్తకుండా ఓఎన్ జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశ నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.