విశాఖను వాణిజ్య నగరంగా అభివృద్ధి చేస్తున్నాం
అభివృద్ధి కోసమే తక్కువ ధరలకు భూములిచ్చాం
యువతకు ఉద్యోగాల కల్పన కూడా మా లక్ష్యం
మీడియా సమావేశంలో మంత్రి లోకేశ్ స్పష్టం
విశాఖపట్నం : అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించలేక పోయిందని ఏపీ ఐటిశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలయాపన కారణంగా రాజధాని లేకుండా చేశారని అన్నారు. భూములు ఇచ్చిన రైతులను ఆగం చేశారని మండిపడ్డారు. విశాఖపట్నంలో మీడియాతో లోకేశ్ మాట్లాడారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్లో ఉన్నామని గుర్తు చేశారు. రాజధాని అమరావతికి మంచి విమానాశ్రయం కావాలి.. అందుకే భూసేకరణ చేస్తున్నాం అని అన్నారు.. ప్రాజెక్టుల పూర్తికి సమయం పడుతుంది. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఎకరం 99 పైసలకే ఇస్తున్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి.. మన యువతకు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులను ఆకర్శించాల్సి ఉందన్నారు. అనేక కంపెనీలు పోటీపడి వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఆర్థిక రాజధాని విశాఖే కాబట్టి ఇక్కడ అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని అన్నారు. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున ఐటి కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అందుకే ఇక్కడకి పెట్టబడులు వస్తున్నాయి. విశాఖకు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్, స్టీల్ సిటీలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానం అని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టం అని లోకేశ్ స్పష్టం చేశారు. సముద్రంలో కలిసే వేల టీఎంసీలు కాపాడి. రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు మేం ఎక్కడా చిల్లు పెట్టలేదు. మిగిలిన నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చు.. చెన్నైకు ఇవ్వొచ్చు. గతంలో పట్టిసీమ దండగని జగన్ అన్నారు. దాన్నే ఐదేళ్లు వాడుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. అందుకే పనుల్లో వేగం పెంచామని, అభివృద్ధిలో దూసుకు పోతున్నామని తెలిపారు. ఎపిని అగ్రభాగాన నిలబెట్టే క్రమంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం
ప్లాంట్ భూములు ఎవ్వరికీ కేటయించేది లేదు
భోగాపురం క్రెడిట్ కావాలంటే వైకాపా తీసుకోవచ్చు
అన్ని వైఫల్యాల క్రెడిట్ కూడా తీసుకుంటే మంచిది
మీడియాతో లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు
విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపు నిచ్చారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్కు కేటాయించామని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కావాలంటే తీసుకోవచ్చంటూ వైసీపీ వాళ్లకు లోకేశ్ సూచించారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లగొట్టిడం, పీపీలు రద్దు, పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పంపేయడం, ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం వంటి సంఘటనల క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమవుతాయని లోకేశ్ చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కనెక్టింగ్ రోడ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క 108 వాహనం ఆగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా 108 వాహనాలు ఆగిపోయాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగాలు కల్పించడానికే తక్కువ ధరలకు భూములు కేటాయిస్తున్నామని.. అది కూడా సామర్థ్యం ఉన్న కంపెనీలకే ఇస్తున్నామని లోకేశ్ వివరించారు. గత ఐదేళ్లలో వైసీపీ చేయలేని పని తాము ఇప్పుడు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకు వస్తున్నామని తెలిపారు. రాజకీయ లబ్ది పొందటానికి కొంత మంది జల వివాదం చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో అధికారంలో ఎవరున్నారని జలవివాదంపై ప్రశ్న అడిగిన విలేకర్లను లోకేశ్ నిలదీశారు.