మంత్రులు, అధికారుల పనితీరే కారణం
2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి :సీఎం చంద్రబాబు
ఇకమీదట కూడా అదే జోరు కొనసాగించాలని సూచన
పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో బాబు
గత ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని... అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుసూచించారు. 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశామని... అందుకే మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో సీఎం అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేశారంటూ కితాబిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని సీఎం అన్నారు. ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశామన్నారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని సీఎం వెల్లడించారు. రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించామన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని సీఎం తెలిపారు. విద్యుత్ రంగంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయన్నారు.
దావోస్ సదస్సుకు వెళ్లామని.. ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగామని అన్నారు. అలాగే విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగామని సీఎం తెలిపారు. గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారని తెలిపారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని... ఆ కిక్ కోసం అందరూ పని చేయాలని సూచించారు.