టాలీవుడ్లో సంక్రాంతి సీజనన్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న సినిమాగా 'మన శంకర వరప్రసాద్ గారు' నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పండగకు విడుదలై థియేటర్లలో జోరుగా సాగుతోంది. ప్రమోషన్ల దశ నుంచే భారీ అంచనాలు ఏర్పడగా, విడుదల తర్వాత ఆ అంచనాలను వసూళ్ల రూపంలో నిజం చేస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలిరావడంతో అన్ని ప్రాంతాల్లోనూ షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత ఊపందుకున్నాయి. ఆన్లైన్ టికెట్ బుకింగ్ లోనూ ఈ సినిమానే ముందంజలో ఉంది. బుక్‌మైషో వేదికగా ఇప్పటివరకు దాదాపు 2.5 మిలియన్ల టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత రోజురోజుకీ వసూళ్లు పెరుగుతూ మూడో రోజుకు రూ.150 కోట్ల గ్రాస్ మార్ను, నాలుగో రోజుకు రూ.200 కోట్ల క్లబ్‌ను దాటింది. తాజాగా ఐదు రోజుల కలెక్షన్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇది ఒక ప్రాంతీయ సినిమాకు ఆల్‌టైమ్ రికార్డు అని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. నిర్మాతల ప్రకటనలో 'ప్రతి మార్కెట్లో 'మన శంకర వరప్రసాద్ గారు' డామినేషన్ కొనసాగుతోంది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇది రీజినల్ సినిమా చరిత్రలో అరుదైన ఘట్టం' అని పేర్కొన్నారు. వీకెండ్ మొత్తం సినిమా ట్రెండ్ కొనసాగుతుందని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. వీటీవీ గణెళిష్, యూట్యూబర్ నందన తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.