యువతను తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడి
అమరావతి : తన రాజకీయ ప్రయాణంలో యువత పాత్రను ప్రత్యేకంగా స్మరించుకుంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ) యువజన విభాగం 'యువరాజ్యం' కోసం పటిష్ఠమైన యువజన విభాగం నిర్మించాలని ప్రణాళిక చేశానని తెలిపారు. జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లలో ఎన్నో కష్టాలు, పోరాటాలను అధిగమించిన తర్వాత.. పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అనుభవం, పరిణితితో నిండి, సంస్థాగత బాధ్యతలు చేపట్టడానికి, రాజకీయాలు నిర్వహించడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ యువరాజ్యం యువజన విభాగానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 2005 నుంచి ఇప్పటి వరకు తనను విశ్వసించి అండగా నిలిచిన యువతకు పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీ, నిబద్ధత, దేశభక్తి కలిగిన యువతను, చైతన్యవంతమైన నాయకులను తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని పవన్ ప్రతిజ్ఞ చేశారు. నూతన భారత్.. జెన్రెడ్ తరం నుంచి అద్భుతమైన నాయకుల ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. జెన్డ్ తరం.. బుజ్జగింపు రాజకీయాలు, వంశపారంపర్య రాజకీయాలు, కుల రాజకీయాలు, విభజన రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలతో విసిగిపోయిందని అభిప్రాయపడ్డారు. ఈ తరం.. జవాబుదారీతనం గల రాజకీయాలను తీసుకురాగల నాయకుల కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. అంతేగానీ, ప్రపంచ వేదికలపై భారత్‌ను బలహీనపరిచే నాయకుల కోసం కాదన్నారు. బలమైన, పటిష్ఠమైన భారత్‌ను నిర్మించగల నాయకుల కోసం జెన్‌జడ్ యువత ఎదురుచూస్తోందని ఎక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.