రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రానున్న చిత్రం 'వారణాసి' కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తాజాగా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జనవరి 5న ఈ సినిమా టైటిల్ టీజర్‌ను పారిస్‌లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ విషయం తెలుపుతూ లే గ్రాండ్ రెక్స్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో అక్కడ ప్రదర్శించిన తొలి భారతీయ సినిమా గ్లింప్స్ 'వారణాసి' రికార్డు నెలకొల్పింది. ఇది ఇండియన్ సినిమాకు గొప్ప గుర్తింపు అని అభిమానులు భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్ 'కబాలి', ప్రభాస్ 'బాహుబలి 2', 'సాహో' చిత్రాలను ఈ థియేటర్ ప్రదర్శించారు. అయితే విడుదలకు ముందే భారీ స్థాయిు-లో గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 'వారణాసి' సిద్ధమవుతోంది. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర' పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు నేర్చుకున్నారు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఆయన రాముడిగానూ కనిపించనున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఐమ్యాక్స్ వెర్షన్లోనూ రూపొందుతున్న ఈ సినిమా 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.