అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు
ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వం కృషి
గతంలో అన్నదానాన్ని అడ్డుకున్న గొడ్డలి పార్టీ
ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 క్యాంటీన్లు ప్రారంభం
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరిం చారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కార్మికులతో కలిసి భోజనం చేశారు. లబ్దిదారులతో ముచ్చటించారు. అంతకు ముందు క్యాంటీన్‌కు వచ్చిన పేదలు, కార్మికులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం రుచి, శుభ్రత, నాణ్యతలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పేదవాడికి పటెడన్నం పెట్టడమే నా రాజకీయం అని, ఎన్టీఆర్ రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత పథకానికి నాంది పలికారని గుర్తుచేశారు. నిత్యాన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు అజరామరం. ఆకలి అన్న వాళ్ల కాదనకుండా అన్నం పెట్టడం మన సంస్కృతి లోనే ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. 2024లో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశామని, ముందుగా పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించామని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి ఈ సంఖ్య 269కి పెరిగిందని సీఎం చెప్పారు. త్వరలో మరో 5 క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయని తెలిపారు.
అక్షయ పాత్రకు అభినందనలు...
అన్న క్యాంటీన్లకు నిరంతరం ఆహార సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 25 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ 500 కోట్ల భోజనాలను సరఫరా చేసింది. అన్న క్యాంటీన్లలో రూ.5కే అందిస్తున్న భోజనం పేద వాళ్లు, ఆటోడ్రైవర్లు, ముఠా కార్మికులు, కూలీ లకు ఆసరాగా నిలుస్తోంది అని ప్రశంసించారు. ఒక్కో అన్న క్యాంటీన్లో రోజుకు సగటున 1,013 మంది ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీని నిర్వహణకు రూ.26,250 ఖర్చు అవుతుంది. రాష్ట్రంలోనిఅన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. దీనికోసం రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతోంది అని వెల్లడించారు.
పేదల పొట్టగొట్టిన గత పాలకులు...
గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్ని క్యాంటీన్లపైనా దాడులు చేశారు. పేదల కడుపు నింవుతున్న పథకాన్ని నిలిపివేశారు అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి కావాల్సింది విధ్వంసం, హింస, కూల్చడం, నరకడం, నాశనం చేయడమేనని దుయ్యబ ట్టారు. ఏ రాజకీయపార్టీ అయినా ప్రజలకు ఏంచేస్తామో చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం రప్పా రప్పా చేస్తాం. 2029 లో విధ్వంసం చూపిస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడు తోంది అని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీ గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రవీణ్, కలెక్టర్ కృతికా శుక్లా, తదితరులు పాల్గొన్నారు.