గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదల మ-రోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే. మిగిలి ఉందని చిత్రబృందం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సినిమా ఎడిట్ ప్రింట్ చూసుకున్నామని, అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నామని పేర్కొంది. "ప్రేక్షకులకు అత్యుత్తమ థియేటర్ అనుభవాన్ని అందించాలనేదే మా లక్ష్యం. అద్భుతమైన కంటెంట్‌ను అంతే గొప్పగా ముస్తాబు చేసేందుకు, పోస్ట్ ప్రొడక్షన్, టెక్నికల్ టీమ్స్‌కు మరికొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం. వారి నైపుణ్యంతో సినిమాను పరిపూర్ణంగా తీర్చిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని నిర్మాతలు వివరించారు. సినిమా పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు తెలిపిన చిత్రబృందం, అభిమానుల సహకారానికి కృతజ్ఞతలు చెప్పింది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జూన్‌లో కచ్చితమైన విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.