ప్రముఖ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఘాటుగా స్పందించారు. మైక్రోఫోన్ చేతికి దొరికినంత మాత్రాన మాట్లాడే మాటల్లో తెలివి ఉండదని, అది మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తుందని ఆమె చురకలంటించారు. ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో త్రిషను ఉద్దేశించి పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో దుమారం రేపాయి. ఇటీవల జరిగిన గలాటా అవార్డ్స్ కార్యక్రమంలో గతంలో తను కలిసి పనిచేసిన నటీనటులపై అభిప్రాయం చెప్పాలని పార్థిబన్ను కోరారు. ఈ క్రమంలో తెరపై త్రిష ఫొటో కనిపించగానే, ఆయన ఆమె పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "ఈ కుందవైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉ ంచాలి. బయటకు రాకుండా చూసుకోవాలి. అదే మంచిది” అని అన్నారు. ఇటీవల నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకలో కనిపించిన నేపథ్యంలో పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై త్రిష తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా గట్టిగా బదులిచ్చారు. “ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా చెప్పించి చివరి నిమిషంలో నా పేరు, ఫొటో చేర్చారని ఆర్గనైజర్లు నాకు తెలిపారు" అని ఆమె వెల్లడించారు. "చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన మాట్లాడే మాటలు తెలివైనవిగా లేదా హాస్యంగా ఉండవు. అది మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తుంది. అవగాహన లేకుండా మాట్లాడే అసభ్యకరమైన మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో వారి కంటే, మాట్లాడిన వ్యక్తి గురించే ఎక్కువ చెబుతాయి” అని ఆమె పోస్ట్ చేశారు. త్రిష స్పందనకు నెటిజన్ల నుంచి మద్దతు లభించింది.