సోషల్ మీడియాతో పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు
అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
25 నూతన పాలసీలతో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం
3 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్
లడ్డూ కల్తీ జరిగినా ఇంకా క్షమాపణలు చెప్పరా?
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం బాబు
సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
శు క్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
రాబోయే 90 రోజుల్లోగా దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
అమరావతి : రాష్ట్రంలో 13 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే అంశంపై చర్చిస్తున్నామని ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనంపై ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఓ సిఫార్సు కూడా చేశారని సీఎం తెలిపారు. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవద్దనే సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నారు. స్వప్రయోజనాల కోసం సాంకేతికతను ఉ పయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని, దానికి బానిసై చెడుకు ఉపయోగిస్తే నాశనమవుతారని అన్నారు. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చిందని, వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని, 13-16 ఏళ్ల లోపు వారికి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 25 నూతన పాలసీలు తీసుకురావటం ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. వీటితో 23 లక్షల మందికి ఉ ద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి అవరోధంగా ఉన్న నాలా చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి అవినీతిని కట్టడి చేశామని సీఎం చెప్పారు. జన్ విశ్వాస్ ద్వారా పాత చట్టాలను మారుస్తున్నామని.. దీనికి సంబంధించి బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. గత పాలకులు ఐదేళ్లలో 884 కి.మీ సీసీ రోడ్లు, 234 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేశారని ముఖ్యమంత్రి వివరించారు. 4,998 కిలోమీటర్ల సీసీ రోడ్లను కేవలం 20 నెలల్లో పూర్తి చేయించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారన్నారు. ప్లలె పండుగ, అడవి తల్లి బాట పేరిట గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోశాలల నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం కూడా జరుగుతోందన్నారు. 9 కోట్ల పనిదినాలు కల్పించేలా కూడా ఉపముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని సీఎం తెలిపారు. నరేగా నుంచి వీబీజీ రామ్ జీ పథకానికి మార్పు జరిగిందన్నారు. బ్జడెట్ తగ్గకుండా ఆ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుందామన్నారు సీఎం. ప్లలెల్లో కొత్త వెలుగులు చూసేందుకు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటున్న కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలోనూ వివిధ సంస్కరణల్ని అమలు చేసి నైపుణ్యం పెంచేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్ తయారు చేసుకున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నామని.. మూడు ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు అనుమతితో కర్నూలుకు హైకోర్టు బెంచ్ సాధించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అంశంపై సంకల్పం చేస్తామన్నారు. ఉగాదికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేయించేలా చర్యలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు ముఖ్యమంత్రి. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గిన్నీస్ రికార్డు సాధించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డేను నిర్వహించామన్నారు. యోగా, నేచురోపతి లాంటి అంశాలను మేళవించి ప్రజారోగ్యాన్ని కాపాడతామని తెలిపారు. ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైట్ కాలర్ క్రైమ్స్, డిజిటల్ క్రైమ్స్, సైకోలు సోషల్ మీడియాలో అరాచకం చేస్తున్నారని.. మహిళలపై నేరాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మావోయిస్టులను కట్టడి చేశామని.. ఫ్యాక్షనిజాన్ని రూపుమాపామని తద్వారా ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు కొత్తగా రప్పా రప్పా రాజకీయం వచ్చిందని.. పెళ్లికి వెళ్తే కూడా రప్పా రప్పా అంటూ దాడులు చేయాలా? భద్రతకు వెళ్లిన ఎస్ఐ గాయపడేలా వర్యటనలు ఉంటాయా? గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్లను పక్కన పెట్టుకునే నాయకుడు ఎక్కడైనా ఉ ంటారా? కటౌట్లకు పొట్టేళ్లతో రక్తాభిషేకం చేయటం ఏమిటి? ఇంత నేరుగా హింసను ప్రోత్సహిస్తారా?' అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టు మార్టానికి కారకులైన వారు పోస్టు మార్టానికే వెళ్తారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 'రాష్ట్రంలో ఈ విధ్వంస యాత్రలు ఏమిటి.. టైర్ల కింద మనుషుల్ని తొక్కించి నింద ప్రభుత్వంపై వేస్తారు. పరామర్శలకు వెళ్లి బలప్రదర్శనలు చేయటం ఏమిటి. 5 కిలోమీటర్లను 6-7 గంటల ప్రయాణం ఎవరైనా చేస్తారా? ప్రతిపక్షంలో ఉండి పెట్టుబడులు రాకుండా ఇష్టానుసారం మాట్లాడతారా? మేం అధికారంలోకి వస్తే పెట్టుబడులు రద్దు చేస్తామంటూ హెచ్చరికలు చేయటం ఏమిటి? దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా వ్యవహరించలేదు' అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని సీఎం విమర్శించారు. తెలియకుండా జరిగిన నేరంకాదని.. కుట్రతోనే కావాలని చేసిన నేరం ఇది అని అన్నారు. ఏడు కొండలను రెండు కొండలు చేసినప్పటి నుంచే ఈ కుట్ర కొనసాగుతోందని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీడీబీ ఇచ్చిన నివేదికలో కూడా 'అది కల్తీ నెయ్యి' అని స్పష్టంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా హిందూ మఠాలు, పీఠాలు ముక్త కంఠంతో వ్యతిరేకించినా కనీసం ఆ పార్టీ క్షమాపణ చెప్పలేదని సీఎం అన్నారు. ప్రభువా క్షమించు అంటూ సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాయించుకున్న వ్యక్తి నైవేద్యం కల్తీ చేసి క్షమాపణలు చెప్పరా అని నిలదీశారు. మత సామరస్యాన్ని గౌరవిస్తూ క్షమాపణ చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలోనూ ఇదే అంశంపై గొడవ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నా అన్ని పథకాలు కొనసాగిస్తున్నామని, వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు.