సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలుపుతో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలవగా.. సొంతగడ్డపై టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. 2024 వరల్డ్ కప్ విజయం తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటనతో యువ జట్టు ఎలా ఆడుతుందో అని అనుమానాలు ఉన్నా.. అన్ని ఫటాపంచల్ చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నుంచి టీ20 వగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోని కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇక భవిష్యత్ ప్లానింగ్స్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 35 ఏళ్లు కాగా.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, వచ్చే వరల్డ్ కప్ (2028) నాటికి సూర్యకు 37 ఏళ్లు వస్తాయి. అప్పటివరకు టీమ్‌లో ఉన్నా కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అనేది అనుమానమే. ప్రస్తుతం ఉన్న టీమ్‌లో కెప్టెన్సీ రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందు వరుసలో మాత్రం సంజూ శాంసన్ పేరు మారుమోగిపోతుంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-8 ఆఖరి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండడం.. టీమ్‌లో సీనియర్ ప్లేయర్ కావడంతో సూర్యకు సరైన వారసుడు సంజూనే అని మాజీలు విశ్లేషిస్తున్నారు. కొత్త కెప్టెన్సీ అంశంపై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీకి సంజూ శాంసన్ బలమైన పోటీదారుడని చెప్పాడు. సంజూకు కెప్టెన్ ఉండాల్సిన అనుభవం, అవగాహన ఉ ందని అన్నాడు. క్లిష్ట సమయాల్లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా సంజూ నిర్ణయాలు తీసుకోగలడని పేర్కొన్నాడు. సూర్య తరువాత కొత్త కెప్టెన్ ఎవరు అని ఇప్పుడే చెప్పడం కష్టమైనా.. సంజూ మాత్రం ముందు వరుసలో ఉంటాడని అన్నాడు. కెప్టెన్ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అయి ఉండాలని.. బౌలింగ్‌లో మార్పులు.. సరైన ప్లేయర్లను తుది జట్టులో ఆడించడం.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు మద్దతుగా ఉండడం ఇవన్నీ ఆటలో భాగమని కెప్టెన్‌గా తెలిసి ఉండాలన్నాడు. "సంజూ కచ్చితంగా కెప్టెన్సీ రేసులో ఉంటాడని నేను భావిస్తున్నాను. సూర్య రిటైర్మెంటె ప్రకటిస్తే.. సంజూ ఆ స్థానాన్ని భర్తీ చేయగలడు. ఐపీఎల్లో లో చాలా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రాజస్థాన్ రాయల్స్‌ను 2022 ఫైనల్‌కు నడిపించాడు. సంజూ వయస్సు కేవలం 31 సంవత్సరాలు. టీమిండియా తదుపరి కెప్టెన్ కావచ్చు" అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న వారిలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి.. మళ్లీ తీసేశారు. వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు తక్కువే. మిగిలిన వారందరితో పోల్చినా.. సంజూనే బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడని ఇతర మాజీ ప్లేయర్లు కూడా అంటున్నారు.