ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మోడువారిన కొబ్బరి చెట్ల సమస్యకు శాశ్వత పరిష్కారంగా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులను రూ.20 కోట్ల వ్యయంతో మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
గతంలో రాజోలు పర్యటన సందర్భంగా ఎండిపోయిన కొబ్బరి తోటలను చూసి తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్, రైతులకు 45 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇచ్చిన మాటను, గడువు కంటే ముందే వైకుంఠ ఏకాదశి నాటికి నిలబెట్టుకోవడం విశేషంగా మారింది. సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పూడికతీత, గట్ల బలోపేతం పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నారు.
మలికిపురం మండలంలోని కేశనపల్లి తుపాను పునరావాస కేంద్రంలో అధికారికంగా పనులకు శ్రీకారం చుట్టగా, పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా శంకరగుప్తం డ్రెయిన్‌లో 8.50 కిలోమీటర్ పాయింట్ నుంచి 16.50 కిలోమీటర్ పాయింట్ వరకు డ్రెడ్జింగ్ చేపట్టనున్నారు. అలాగే డ్రెయిన్ ప్రారంభమైన స్థలం నుంచి 14.50 కిలోమీటర్ పాయింట్ వరకు ఇరువైపులా గట్లను పటిష్ఠం చేయనున్నారు. దీంతో నీటి పారుదల మెరుగై, కొబ్బరి తోటలకు మళ్లీ జీవం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, శంకరగుప్తం డ్రెయిన్ పనులతో డెల్టా ప్రాంతంలో ప్రక్షాళన ప్రారంభమైందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పంటకాలువల అభివృద్ధికి సుమారు రూ.4 వేల కోట్ల అవసరం ఉందని తెలిపారు. ఈ అంశంపై గతంలో బీసీ రోశయ్య కమిటీ నివేదిక ఇచ్చిందని, ఆ నివేదిక ఆధారంగా ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని చెప్పారు.
“రైతుల కంట కన్నీరు రాని రాష్ట్రమే నిజంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోనసీమ రైతులు గత రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శంకరగుప్తం డ్రెయిన్‌పై ఉన్న ఆక్రమణలను తొలగించడంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
అదేవిధంగా కొబ్బరి రైతుల విన్నపం మేరకు కోకోనట్ బోర్డు ఏర్పాటు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రైతులకు మరింత మద్దతు అందేలా ప్రయత్నిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.