మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నచిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది చిత్రయూనిట్. ఇప్పటికే పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్.. జనవరి 4న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు ఇంకా 9 రోజులు ఉందని తెలుపుతూ కౌంట్ డౌన్ పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్లో చిరంజీవితో పాటు అమృతం ఫేమ్ హర్షవర్ధన్, హీరోయిన్ కేథరిన్, అభినవ్ గోమఠం ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, ఇప్పటికే కొత్త సినిమాలకు సంబంధించి పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ పరంపర ఇంకా కొనసాగుతోంది. తాజాగా వివిధ సినిమాలకు సంబంధించి పోస్టర్లను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి. ఇందులో హర్షవర్ధన్, కేథరిన్, అభినవ గోమఠం తదితరులు చిరంజీవి వెనక నిలబడి ఉన్నారు. మరోవైపు ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యూఎస్‌లో ఇప్పటికే 5వేలకు పైగా టికెట్లు విక్రయమయ్యాయి. సినిమా విడుదలకు 9 రోజుల సమయం మాత్రమే ఉ ండటంతో ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు చేయనున్నారు. జనవరి 3న రాజమహేంద్రవరంలో మొదలయ్యే ప్రచారం తిరుపతి, నెల్లూరు, విశాఖ, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, అనంతపురం, వరంగల్, బెంగళూరుల్లో జరగనుంది. వీటిలోని కొన్ని వేదికల్లో చిరంజీవి పాల్గొంటారని సమాచారం. తిరుపతిలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దీని రన్‌టైమ్ 2 నిమిషాల 30 సెకన్లుగా అనిల్ రావిపూడి తెలిపారు.