శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణల మధ్య మకర జ్యోతిని అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.30 గంటల నుంచి 6.45 గంటల మధ్య మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయితే ఈ సారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉ న్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మకర దర్శనం కోసం సన్నిధానం, పంబ, శబరిమల కొండ, నీలిమల ప్రాంతాలు అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోయాయి.దాంతో బుధవారం ఉదయం 10గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానానికి భక్తులను అనుమతించ లేదని సమాచారం. పంచగిరులు.. నీలిమల, కరిమల, శబరిమల, అప్పాచిమేడు, అలుదామేడు ప్రాంతాల్లో ఈ దివ్య జ్యోతి దర్శనం స్పష్టంగా కనిపించింది. దాంతో ఆయా ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. శబరిమలలో సంక్రాంతి పండగ వేళ.. వంచగిరులపై మకరవిలక్కు (మకర జ్యోతి)గా అయ్యప్ప స్వామి వారు దర్శనమిస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. గత కొన్ని శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. దాంతో లక్షలాది మంది భక్తులు శబరిమలకు మకర సంక్రాంతి వేళ.. తరలివస్తారు. మరోవైపు ఈ రోజు అంటే.. బుధవారం మధ్యాహ్నం 3.13 గంటల నుంచి మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభమైంది. దీంతో స్వామివారికి మేల్ శాంతుల పేరిట తంత్రిలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఇక జనవరి 12వ తేదీన పందళం. రాజప్రసాదం నుంచి బయలుదేరిన స్వామివారి ఆభరణాలు ఈ రోజు సాయంత్రం 5.20 గంటలకు స్వామివారి సన్నిధికి చేరుకున్నాయి. వాటిని స్వామివారికి అలంకరించి.. మహదీపారాధన నిర్వహించారు. ఈ దీపారాధన అనంతరం పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. అంటే సాయంత్రం 6.30 గంటల నుంచి 6.45 గంటల వరకు అంటే పావుగంట మధ్య మూడుసార్లు స్వామివారు దీప రూపంలో దర్శనమిచ్చారు. జనవరి 19వ తేదీ వరకు స్వామివారి దర్శనం కొనసాగనుంది. ఆ మరునాడు అంటే జనవరి 20వ తేదీ ఆలయాన్ని మూసివేయనున్నారు.