ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన డూ ఆర్ డై సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సంజూ శాంసన్ తో పాటు మ్యాచ్ చివర్లో శివమ్ దూబే కొట్టిన రెండు బౌండరీలు కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించాయని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. తీవ్ర ఒత్తిడిలో దూబే ఆ రౌండు బౌండరీ కొట్టకపోయి ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేదని చెప్పాడు. భారత విజయంలో సంజూ ఇన్నింగ్స్ ఎంత పాత్ర పోషించిందో.. శివమ్ దూబే బౌండరీలకు అంతే విలువ ఉందని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్.. శివమ్ దూబే బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'మనం కొన్ని ప్రత్యేకమైన సహకారాల గురించి మాట్లాడుకుందాం. శివం దూబే కొట్టిన ఆ రెండు బౌండరీలు.. సంజూ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ తో సమానమని నేను భావిస్తున్నాను. ఇది ఒక టీమ్ గేమ్. కాబట్టి ఆ రెండు బౌండరీలు సంజూ ఇన్నింగ్స్ అంత కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోయి ఉ ంటే.. సంజూ ఇన్నింగ్స్ గురించి ఎవరూ మాట్లాడుకునేవాళ్లు కాదు. సంజూ శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ జట్టు గెలవడానికి ఇలాంటి చిన్న చిన్న సహకారాలే సహాయవడతాయి. పెద్ద స్కోర్లు హెడ్‌లైన్స్‌లో నిలుస్తాయి, కానీ జట్టు గెలుపు గీత దాటడానికి దోహదపడే ఇలాంటి చిన్న సహకారాలే చాలా కీలకం. నేను హెడ్ కోచ్‌గా ఉన్నంత కాలం ఇదే మా ఫిలాసఫీగా ఉంటుంది.'అని గంభీర్ స్పష్టం చేశాడు.