ప్రఫుల్ వండర్.. అరంగేట్రంలోనే సంచలన బౌలింగ్ తొలి ఓవర్ లో మూడు వికెట్లతో అరుదైన రికార్డు నాలుగు వికెట్లతో సకీబ్ విజృంభణ
ఐపీఎల్లో సంచలనం! పరుగుల వరద పారుతున్న లీగ్‌లో వికెట్ల వేట. సుదీర్ఘ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ ప్రఫుల్ హింగే కొత్త చరిత్ర లిఖించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే మూడు వికెట్లు పడగొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో మొదలుపెట్టి జురెల్, ప్రిటోరియస్‌ను పెవిలియన్ పంపిన హింగే అరుదైన రికార్డ్ లిఖించాడు. చురుకైన వేగానికి స్వింగ్ జోడిస్తూ హింగే సాగించిన వికెట్ల విధ్వంసం మాటల కందనిది. సహచర బౌలర్ సకీబ్ హుస్సేన్‌తో కలిసి హింగే వికెట్ల వేటతో రాజస్థాన్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఆహా ఏం మ్యాచ్! స్టేడియంలో ప్రేక్షకులకు తోడు లక్షలాది మంది ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపింది. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్), రాజస్థాన్ రాయల్స్ పోరు అభిమానులను కట్టిపడేసింది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యఛేదనలో అరంగేట్రం యంగ్ గన్స్ ప్రఫుల్ హింగే (4/34), నకీబ్ హుస్సేన్ (4/24) ధాటికి రాయల్స్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(0)తో మొదలైన హింగే వికెట్ల వేట ధృవ్ జురెల్ (0), డీ ప్రిటోరియస్ (0) వరకు ఘనంగా సాగింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌ లర్గా హింగే రికార్డు సృష్టిస్తే.. తనదైన పేస్‌తో సకీబ్..రాయల్స్ నడ్డివిరిచాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన బంతులను ఆడటంలో రాయల్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. వీరి ధాటికి కనీసం 50 పరుగులైనా చేరుకుంటుందా అన్న దశలో ఫెరీరా(44 బంతుల్లో 69, 7ఫోర్లు, 3 సిక్స్‌లు), జడేజా(32 బంతుల్లో 45, 5ఫోర్లు) రాయల్స్ పరువు నిలబెట్టారు. దీంతో రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు చాపచుట్టేసింది. అంతకుముందు ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91, 8 ఫోర్లు, 6సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీ ధాటికి హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 216/6 స్కోరు చేసింది.
అభిషేకశర్మ(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా.. బ్యాటింగ్ భారాన్ని తనపై వేసుకుంటూ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మిడిల్లో క్లాసెన్ (40)తో కలిసి కిషన్ కీలక భాగస్వామ్యంతో జట్టు భారీ స్కోరుకు కారణమయ్యాడు. ఆర్చర్(2/37) రెండు వికెట్లు తీశాడు. నాలుగు వికెట్లతో రాయల్స్ నడ్డివిరిచిన హింగేకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
హింగే, సకీబ్ విజృంభణ:
2.6 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ స్కోరు 5/9. హింగే, సకీబ్ పేస్ ధాటికి రాయల్స్ ఇన్నింగ్స్ కకావికలమైంది. గత మ్యాచ్‌ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కుర్రాళ్లకు అవకాశమిచ్చిన ఎస్ఆర్హెచ్ ఊహించని ఫలితాన్ని అందుకుంది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా పోటీకి దిగిన హింగే.. తొలి ఓవర్లో రాయల్స్ వతనానికి నాంది వలికితే.. సకీబ్ దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. మొత్తంగా ఇద్దరు అరంగేట్రం యువ పేసర్లు తమ స్వింగ్ బౌలింగ్‌తో రాయల్స్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు.
లీగ్ లో మేటి బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న సూర్యవంశీని హింగే గోల్డెన్ డక్‌గా పంపించగా, మంచి ఫామ్ మీదున్న జురెల్ బంతిని వికెట్ల మీదికి ఆడుకుని మూల్యం చెల్లించుకున్నాడు. హెట్మెర్ బదులు జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్ భారీ షాట్ ఆడబోయి నితీశ్ చేతికి చిక్కాడు. హింగేతో పోటీపడుతూ సకీబ్..జైస్వాల్(1), పరాగ్(4), ఫెరీరా, బిష్ణోయ్(0)ను పెవిలియన్ పంపి సత్తాచాటాడు. మిడిల్ లో ఫెరీరా, జడేజా కలిసి ఆరో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు నిలదొక్కుకోపోతే రాయల్స్ పరువు గంగలో కలిసేది. ఆఖర్లో దేశ్‌పాండే(25) బ్యాటు ఝులిపించినా లాభం లేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు:
హైదరాబాద్: 20 ఓవర్లలో 216/6(కిషన్ 91, క్లాసెన్ 40, ఆర్చర్ 2/37, ( పరాగ్ 1/5),
రాజస్థాన్: 19 ఓవర్లలో 159 ఆలౌట్ (ఫెరీరా 69, జడేజా 45, 2໖ 4/24, 5 4/34).