తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ సూర్యకాంత్
తిరుపతి : ప్రజలకు న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలని.. అదే సమయంలో న్యాయం త్వరగా అందాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. ఆదివారం తిరుపతిలోని దామినీడులో ప్రభుత్వం కేటాయించిన 14.5 ఎకరాల్లో రూ.115కోట్ల అంచనా వ్యయంతో 16 కోర్టు కార్యాలయాలతో కూడిన ఆరంతస్తుల భవన సముదాయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం తిరుపతి బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. భవన సదుపాయాలు, ఇతర ఆధునిక మౌలిక వసతుల కల్పన అనేది దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని చెప్పారు. అయితే అవన్నీ సమకూర్చుకున్నాక ప్రజలకు సులువుగా న్యాయం అందించడమనే రెండో సవాల్‌ను కూడా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటోందన్నారు. 'తక్కువ ఖర్చుతో ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించే వరిస్థితులు నెలకొనాలి. అదే సమయంలో వారికి సత్వర న్యాయం అందించాల్సిన అవసరం కూడా ఉ ంది. న్యాయస్థానాల్లో బార్ అసోసియేషన్లు, బెంచ్‌లు వేర్వేరు కాదు. న్యాయ వ్యవస్థకు అవి రెండు చేతులు. పరస్పర సమన్వయంతో, సహకారంతో పనిచేయాలి.
ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యత కేవలం న్యాయమూర్తులదే అన్న అపోహ అందరిలో ఉంది. బలమైన న్యాయవాదులు ఉన్నప్పుడే ధర్మాసనం సైతం దానికి తగినట్లు జాగ్రత్తగా, లోతుగా ఆలోచించి తీర్పులు చెబుతుంది. దీనివల్ల తీర్పుల్లో నాణ్యత పెరుగుతుంది. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం, గౌరవం పెంపొందుతాయి. న్యాయస్థానాలకు భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో భూమి ఎప్పుడూ పరిమితంగానే ఉంటుం ది. రాబోయే కాలంలో భూముల కొరత మరింత ఎక్కువగా ఉ ంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే 50 ఏకు వందేళ్ల అవసరాలకు సరిపడే విధంగా భవనాలను, మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాం' అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కోర్టులకు భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.
తిరుమలేశుడి సేవలో జస్టిస్ సూర్యకాంత్
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన జస్టిన్ సూర్యకాంత్ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. రంగనాయక మండవంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు సీజేఐకు శ్రీవారి లడ్డూప్రసాదాలు, చిత్రవటాన్ని అందజేశారు. తర్వాత క్షేత్రసంప్రదాయం ప్రకారం వరాహస్వామిని కూడా దర్శించుకున్నారు. పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ హైకోర్టు సీజే, జడ్జీలతోపాటు అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ అరుణ్ భన్సాలీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.జయచంద్ర, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రశేఖర్ శర్మ, జస్టిస్ బిపిన్ గుప్తా, జస్టిస్ యోగేంద్ర కుమార్ పురోహిత్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజూషా దేశ్‌పాండే, లోకాయుక్త బీఎస్ పాటిల్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.