అమరావతి రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. త్రిసభ్య కమిటీ తరచూ సమావేశం అవుతున్నా వారి సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాలట్లను,నష్టపరిహారం విషయంలో మాటలతో సరిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పాత వ్యవహారాలనే పక్కన పెట్టి కొత్తగా మళ్లీ పూలింగ్ చేపట్టే పనిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగు కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కార్యాలయ భవనాలను గుర్తించింది. భవనాలను గతంలో అనుభవం ఉన్న తొమ్మిది మంది కంప్యూటర్ ఆపరేటర్లను కూడా అన్ని గ్రామాలకూ కేటాయించింది. ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మూడో తేదీన నోటిఫికేషన్ ఇస్తే వెంటనే భూములిచ్చేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తున్నారు. ఇప్పటికే నియామక పక్రియ పూర్తయినా ఒకటీ అరా అభ్యంతరాలున్న నేపథ్యంలో వాటిని వరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మంగళవారం తగు సూచనలు చేసినట్లు సమాచారం. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది కార్యకలాపాలు వంటి అంశాలపై సూచనలిచ్చారు. ప్రతి కార్యాలయంలో ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్నీచర్‌ను కూడా మంగళవారం గ్రామాల్లో యూనిట్ కార్యాలయాలకు తరలించారు. నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తులు తీసుకోవడం, వాటిని పాత రికార్డులతో సరిపోల్చడం వంటి పనులు నిర్వహించ నున్నారు. ప్రతి దరఖాస్తుకూ సంబంధించిన సర్వే నెంబర్లను జిఐఎస్ మ్యాపులో ఉన్న సర్వే నెంబర్లు, ఫీల్డ్ సర్వే నెంబర్లు సరిపోల్చనున్నారు. వాటన్నిటినీ నిర్ధారించాల్సిన బాధ్యతను అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగులో వచ్చిన అప్లికేషన్లలో ఉన్న విస్తీర్ణం, అడంగల్‌లో ఉన్న విస్తీర్ణం ఒకటా కాదా అనేది ధ్రువీకరించిన అనంతరం 9.22 ప్రకటన చేయనున్నారు. గతంలో అన్నీ పూర్తయిన తరువాత సర్వే చేయడంతో కొంత ఇబ్బందులొచ్చాయి. ఈసారి ముందుగానే సర్వే కూడా పూర్తి చేయాలని అనుకున్నట్లు తెలిసింది. దీనిపై ఇంతకుముందు చేసిన అనుభవం ఉండటంతో ఈసారి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ఉండేలా చూస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్న తరువాత వాటిని సర్వేచేసి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయనున్నారు. 9.3 దరఖాస్తులు, 9.14 అగ్రిమెంటు ఫారాలను తీసుకోవాలని నిర్ణయించారు. 9.3 తీసుకునే సమయంలో అందరికీ రసీదులు ఇవ్వాలా లేక 9.14 చేసుకున్న తరువాత ఇవ్వాలా అనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. వీటితోపాటు పూలింగుకు భూములిచ్చిన రైతుల బ్యాంకు అకౌంట్లు.. ఆధార్ లింకు అంశాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు. గతంలో జరిగిన పొరపాట్లు వల్ల చాలా వరకూ పదేపదే తనిఖీలు చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం జరగబోయే పూలింగులో ఇటువంటి ఇబ్బందులేవీ తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఎస్టిసిలకు అప్పగించారు. రెండోదశ పూలింగులో పెదపరిమి రెవెన్యూలో రెండు, వడ్డమాను, వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, చావపాడు, యండ్రాయి, కర్లపూడి-లేమ్లలెలో మొత్తం తొమ్మిది యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో జరగడం లేదన్న ఆరోపణలను మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదు. కేంద్రమంత్రి పెమ్మసాని కూడా రైతుల ప్లాట్ల సమస్యలను పట్టించుకోవాలని కోరుతున్నారు.