ఒక్కోసారి కొన్ని సంకేతాలు మార్పు తథ్యం అనిపిస్తాయి. రాజకీయాల్లో అయితే ప్రతి ముఖ్యమైన పరిణామానికి ముందు తప్పనిసరిగా చాలా హంగామా కనిపిస్తుంది. అయితే, ఇది కొన్నిసార్లు అంతర్గతంగా ఉండొచ్చు.. మరికొన్నిసార్లు ఈ హంగామా బహిరంగంగా జరగొచ్చు. సరిగ్గా ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొదటి రకంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన వారసుడిని సింహాసనంపై కూచోపెట్టడానికి కసరత్తులు చేస్తున్నారనేది పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే, అందుకు అనుగుణంగా హడావుడి వాతావరణం కూడా కనిపిస్తోంది. అతి త్వరలోనే చినబాబు సింహాసనాన్ని అధిష్టించడం ఖాయం అంటూ టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఏపీలో రాజకీయ సంచలనానికి కారణమవుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పదవి నుంచి వైదొలగి, తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చేస్తున్న వ్యాఖ్యలే ఈ ఊహాగానాలకు మరింత ఊపునిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయ్యే నాటికి నాయకత్వ మార్పు ఉండొచ్చని, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు తన వారసుడికి పగ్గాలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడి వయస్సు, అనుభవం, అలాగే పార్టీ భవిష్యత్ నాయకత్వంపై ఆయన ఆలోచనలే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, ఇప్పటికే తన కుమారుడిని కీలకమైన శాఖలకు మంత్రిగా చేసి, భవిష్యత్ నాయకుడిగా తయారు చేశారు. ప్రభుత్వంలో లోకేష్ చు-రుకైన పాత్ర పోషిస్తూ, పాలనపై పట్టును పెంచుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే "ఉగాది నాటికి నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది" అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ మార్పు అంత సులభమా? అన్న ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఇందులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వాన్ని నడువుతున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య సమతుల్యతే ప్రభుత్వ స్థిరత్వానికి కీలకం. ముఖ్యంగా జనసేన పాత్ర ఇప్పుడు అత్యంత కీలకంగా ఉంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం, స్వయంగా చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ మాట్లాడటం.. ఇవన్నీ ప్రభుత్వంలో జనసేన ఎంత కీలక శక్తిగా ఉందో సూచిస్తున్నాయి. జనసేన కార్యకర్తలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష చాలా బలంగా ఉంది. ఇది కేవలం కోరిక మాత్రమే కాదు, ఒక పట్టుదలగా కూడా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
"జనసేన తెలుగుదేశంతో జట్టు కట్టకపోతే వైసీపీని ఓడించడం సాధ్యమయ్యేది కాదు" అనే నమ్మకం జనసేన శ్రేణుల్లో బలంగా ఉంది. అంతేకాదు, కూటమి విజయం కోసం పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేశారన్న భావన కూడా వారిలో చాలా ఎక్కువగానే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే జనసేన ఎలా స్పందిస్తుంది? అనేది నిజంగా మిలియన్ డాలర్ ప్రశ్న. జనసేన నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైతే, కూటమి ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు బీజేపీ వైఖరి మాత్రం భిన్నంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా బీజేపీకి పెద్ద సమస్య ఉండదని, జాతీయ రాజకీయాల దృష్ట్యా రాష్ట్ర నాయకత్వం వారికి రెండవ ప్రాధాన్య అంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల నారా లోకేష్ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
అనుకోని విధంగా జనసేన కూడా లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి అడ్డుపడకపోతే, చంద్రబాబు నాయుడి కోరిక సులభంగా నెరవేరే అవకాశముంది. అయితే, మరో ముఖ్యమైన ప్రశ్న మిగులుతోంది. నారా లోకేష్ ఆ బాధ్యతను సమర్థంగా మోయగలరా? ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంటుంది? సీఎంగా ప్రజలు ఆయనను ఎంతవరకు అంగీకరిస్తారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడే స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.
అయితే చంద్రబాబు నాయుడు ఈ దశలోనే ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారనే అంశాన్ని పరిశీలిస్తే, రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈలోగా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే, ఆయనకు పాలనా అనుభవం పెరుగుతుంది. పార్టీకి కొత్త రక్తాన్ని నింపే అవకాశం లభిస్తుంది. యువతను ఆకర్షించే నాయకుడిగా లోకేష్‌ను ప్రజల్లో స్థిరపరిచే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ లోకేష్ పాలనపై ప్రజల్లో ప్రతికూలత ఏర్పడితే, తదుపరి ఎన్నికల నాటికి వ్యూహాలు మార్చుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడికి ఉంటుంది.
మొత్తానికి, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? చంద్రబాబు నాయుడు నిజంగా విశ్రాంతి తీసుకుంటారా? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ అధికారిక సమాధానం లేదు. కానీ ఏపీ రాజకీయ వాతావరణం చూస్తే. ఈ ఊహాగానాలు అంత తేలికగా కొట్టిపారేయలేనివిగా మారాయి. రాబోయే నెలల్లో కూటమి పార్టీల మధ్య చర్చలు, రాజకీయ సంకేతాలే ఈ అంశంపై స్పష్టత తీసుకువస్తాయని చెప్పవచ్చు. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశమే ప్రధాన చర్చగా కొనసాగడం ఖాయం.
చివరిగా ఒక మాట..
జనసేన ఎలా వ్యవహరిస్తుంది అనేది ఎలా ఉన్నా.. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పే భారతీయ జనతా పార్టీ.. ఆంధ్రప్రదేశ్ లో జరిగే వారసత్వ అధికార మార్పిడిని ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.