భారతదేశం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలపై చైనా మరోసారి ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)ను ఆశ్రయించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, టెలికాం పరికరాలు వంటి ఐసీటీ (ICT) ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు, అలాగే సౌర పరిశ్రమకు అందిస్తున్న సబ్సిడీలు తమ కంపెనీలకు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొంది. ఈ ఫిర్యాదు WTOలో అధికారికంగా దాఖలైనట్లు చైనా తెలిపింది.
చైనా ఆరోపణల ప్రకారం, భారతదేశం అమలు చేస్తున్న ఈ విధానాలు దేశీయ కంపెనీలకు మాత్రమే అనుకూలంగా ఉండి, విదేశీ కంపెనీలకు—ముఖ్యంగా చైనా సంస్థలకు—అన్యాయమైన పోటీ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇది WTO నిబంధనలకు విరుద్ధమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. WTOలో సభ్యదేశాలు పాటించాల్సిన “జాతీయ చికిత్స” సూత్రాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దిగుమతి ప్రత్యామ్నాయ సబ్సిడీలపై ఉన్న నిషేధాన్ని కూడా పాటించడం లేదని చైనా ఆరోపించింది.
ఈ విధానాలను వెంటనే సరిదిద్దాలని, WTO కింద భారత్ తీసుకున్న నిబద్ధతలను గౌరవించాలని చైనా కోరింది. 2025లో భారత్‌పై WTOలో చైనా దాఖలు చేసిన ఇది రెండో ఫిర్యాదు కావడం గమనార్హం. ఇప్పటికే అక్టోబర్ నెలలో, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) మరియు బ్యాటరీల తయారీలో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై కూడా చైనా ఒక కేసు దాఖలు చేసింది.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తోంది. ఈ చర్యల వల్ల భారతీయ కంపెనీలకు అన్యాయమైన ప్రయోజనం కలుగుతోందని చైనా వాదిస్తోంది. దీని ప్రభావంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు మరియు ఇతర సంబంధిత ఉత్పత్తులు భారత మార్కెట్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంది. ఇది తమ వాణిజ్య ప్రయోజనాలకు తీవ్రంగా హానికరమని చైనా స్పష్టం చేసింది.
అలాగే టెలికాం పరికరాలు, ఐసీటీ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న అధిక సుంకాలు కూడా చైనా కంపెనీల ఎగుమతులను ప్రభావితం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అంశాలపై WTO స్థాయిలో చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని, తమ పరిశ్రమల హక్కులను కాపాడుకునేందుకు బలమైన చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, భారత్ ఇప్పటివరకు ఈ తాజా ఫిర్యాదుపై అధికారికంగా స్పందించలేదు. WTO ప్రక్రియల ప్రకారం, ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరగనున్నాయి. అవి విఫలమైతే, వివాద పరిష్కార ప్యానెల్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.