పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె అన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీలో నిబద్ధత అనే పదానికి పూర్తి భిన్నమైన అర్థం ఉందని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉంది. కమిట్మెంట్ ఇవ్వకపోతే కొత్త వారికి అవకాశాలు రావు. సాధారణంగా కమిట్మెంట్ అంటే వృత్తిపరమైన నిబద్ధత అనే అర్థం. కానీ, ఇండస్ట్రీలో మాత్రం దాని అర్థం వేరు. కొందరు పురుషులు ఈ పదాన్ని ఉపయోగించి మహిళల నుంచి ఏవేవో ఆశిస్తారు. గతంలో ఓ ప్రముఖ సింగర్ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలకు భయపడి ఈ రంగాన్నే వదిలివెళ్లిపోయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతోమంది ఇక్కడ వేదికలపై స్పీచ్‌లు ఇస్తూనే ఉన్నారని చిన్మయి తెలిపారు. తాను కూడా గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన తల్లి సమక్షంలోనే ఎంతో నమ్మిన ఒక పెద్దాయన తనతో తప్పుగా ప్రవర్తించాడని అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి ఓ లెజెండ్ అని ఆమె అన్నారు. ఆయన తరంలో నటీనటులంతా ఒకరితో ఒకరు స్నేహభావంతో ఉండేవారని.. పరస్పరం గౌరవించుకునే వారని చెప్పారు. లెజెండ్లతో కలిసి వర్క్ చేసిన వారు కూడా తన దృష్టిలో గొప్పవారేనని చిన్మయి తెలిపారు. ఇటీవల 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్ మీట్లో చిరంజీవి ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. 'సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా ఉంటామో అలాంటి ఫలితమే వస్తుంది. ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వస్తానంటే వారిని ప్రోత్సహించాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ. 'ఇక్కడ నెగెటివ్ పీపుల్ ఉంటారు. చేదు అనుభవాలు ఎదురవుతాయి' అనుకుంటే అది నీ తప్పిదం. నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరు. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవు నువ్వు ప్రొఫెషనల్‌గా ఉండాలి. కొత్త టాలెంట్‌కు ఎప్పుడూ ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది' అని ఆయన అన్నారు. అయితే చిరంజీవి వ్యాఖ్యలతో చిన్మయి విభేదించారు.