లోయర్ ఆర్డర్ వీర విజృంభణతో భీమవరం బుల్స్ గ్రాండ్ విక్టరీ - అశ్విన్ హెబ్బార్ సెంచరీ వృథా
ఏపీఎల్ 2026 సీజన్-5లో రెండో రోజు జరిగిన ఉత్కంఠభరిత పోరులో భీమవరం బుల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. విజయవాడ సన్ రైజర్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చివరి వరకు సరాలు తెగే ఉత్కంఠ నడుమ 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచిన భీమవరం బుల్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ సన్‌రైజర్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. పవర్స్లోలోనే 60 వరుగులు సాధించిన జట్టు, ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేసింది. అశ్విన్ 58 బంతుల్లో 124 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ అభినవ్ 31 బంతుల్లో 41 పరుగులు చేసి తోడ్పాటునందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో విజయవాడ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. భీమవరం బౌలర్లలో హేమంత్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ కు ఓపెనర్లు హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మంచి ఆరంభం ఇచ్చినా, మిడిల్ ఆర్డర్ విఫలమైంది. జట్టు ఓటమి అంచుల్లో నిలిచిన వేళ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ధీరజ్, మునిష్ అసాధారణ పోరాటం చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పారు. ధీరజ్ 22 బంతుల్లో 56 పరుగులు (2 ఫోర్లు, 6 సిక్సర్లు), మునిష్ 28 బంతుల్లో 49 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివర్లో ధీరజ్ వికెట్ వడినా అప్పటికే విజయానికి మార్గం సుగమమైపోయింది. భీమవరం బుల్స్ 19.3 ఓవర్లలో 217 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధీరజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను గాయని సమీరా భరద్వాజ్ తన గానంతో అలరించగా, ఆటతో పాటు పాటను ఆస్వాదించేందుకు అభిమానులు స్టేడియంకు క్యూ కట్టారు.