ఒకప్పుడు టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా, యాంగ్రీ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి హీరోగా కాకుండా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బైకర్' సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మంచి అంచనాలు తీసుకురాగా, తాజాగా మేకర్స్ రాజశేఖర్ పాత్రకు సంబంధించిన 'బు+-లలెట్ సునీల్' గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో రాజశేఖర్‌ను ఓ మాజీ పవర్ఫుల్ బైక్ రేసర్‌గా చూపిస్తూ స్టైలిష్ లుక్, గంభీరమైన ప్రెజెన్స్ ఆకట్టుకున్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనను ఇంత ఎనర్జిటిక్‌గా, మాస్ షేడ్ ఉన్న పాత్రలో చూడబోతున్నామనే సంకేతాలు ఈ వీడియో ఇచ్చింది. గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 'ఇది రాజశేఖర్‌కు గ్యారెంటీ కంబ్యాక్ మూవీ అవుతుంది' అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఆయన కనిపించడమే సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. శర్వానంద్ పాటు రాజశేఖర్ లాంటి సీనియర్ నటుడు కీలక పాత్రలో కనిపించడం సినిమాకు అదనపు బలం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యూత్‌కు దగ్గరైన బైక్ రేసింగ్ కథతో పాటు అనుభవజ్ఞులైన నటుల ప్రెజెన్స్ ఉండటంతో 'బైకర్' మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.