పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాల్సిందే రామాయణ మూవీపై అరుణ్ గోవిల్
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామాయణ' సినిమాలోని పాత్రల గురించి నటుడు అరుణ్ గోవిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలాంటి చిత్రాల్లో నటీనటుల లుక్స్‌పై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తారని తెలిపారు. వారిని జీవితమంతా అదే పాత్రలో గుర్తుంచుకుంటారని అన్నారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణ్' లో అరుణ్ రాముడిగా కనిపించారు. అప్పటినుంచి రాముడి పాత్ర అనగానే ఆయనే గుర్తుండిపోయేలా అందులో కనిపించి ఆకట్టుకున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రానున్న 'రామాయణ'లో అరుణ్ గోవిల్ దశరథుడి పాత్రలో కనిపించనున్నారు. దీని గురించి మాట్లాడుతూ.. 'ఏదైనా సినిమా వస్తుందంటే దానిని పోల్చడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం దేవుడి పాత్ర పోషించేటప్పుడు చూడగానే అలానే కనిపించాలని. లుక్స్ చాలా ముఖ్యం. ఆడియన్స్ తెరపై మనల్ని చూడరు.. మన పాత్రలో ఉన్న దేవుడిని చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉండటాడేమో అనుకోవాలి. అంతలా మనం ప్రభావితం చేయాలని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని 'ఆదిపురుష్'తో పోల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకమన్నారు. రణ్ బీర్ కపూర్ రాముడిగా రానున్న ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.4,000 కోట్లతో రూపొందించనున్నారు. ప్రపంచమంతా ఈ ఇతిహాసాన్ని చూడాలన్న లక్ష్యంతోనే దీన్ని భారీస్థాయిలో రూపొందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఇందులో రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్నాయి.