థియేటర్లో వరుస సినిమాలు అలరిస్తున్నా.. కొన్ని చిత్రాలు ఇప్పటికీ నేరుగా ఓటీటీ వేదికల్లో విడుదలవుతూ ఆసక్తిని పెంచుతున్నాయి. శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'చీకటిలో..'. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నేరుగా విడుదలైంది. నెల్లూరు సంధ్య (శోభిత ధూళిపాళ్ల) ఓ వార్తా ఛానల్లో యాంకర్. క్రైమ్ కథనాలను ప్రేక్షకులకు ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. టీఆర్పీల కోసం కాకుండా వాస్తవాలను వెల్లడించాలన్నది ఆమె అభిమతం. అందుకు విరుద్దంగా ఛానల్ వ్యవహరిస్తుండటం తో స్నేహితురాలు బాబీతో(అదితి) కలిసి సొంతంగా పాడ్‌కాస్ట్ ఛానల్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అదే నమయంలో అమర్ (విశ్వదేవ్ రాచకొండ) ప్రేమలో ఉంటుంది. ఇరు కుటుంబాలు పెళ్లి అంగీకరించిన ఆనందంలో ఉండగా.. బాబీ, అతని బాయ్ ఫ్రెండ్ దారుణంగా హత్యకు గురవుతారు. బాబీని అత్యాచారం చేసి చంపేస్తారు. ఆ హత్య చేసింది వాచ్మెన్ అని సంధ్య గుర్తించడంతో కేసు క్లోజ్ అయిపోతుంది. అప్పుడే సంధ్యకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. తనని పట్టుకోలేక, ఓ అమాయకుడిని బలి పశువును చేశారంటూ అసలు హంతకుడు సంధ్యకు చెబుతాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ రాజీవ్ (చైతన్య) తో కలిసి సంధ్య ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అలా మొదలైన ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రయాణం ఎన్ని మలుపులు తీసుకుంది? పాతికేళ్ల కిందట గోదావరి జిల్లాల్లో జరిగిన హత్యలతో ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి? వీటి వెనుక ఎవరు ఉన్నారన్నది అసలు కథ. కైమ్ మిస్టరీ థ్రిల్లర్లు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. వాటిని ఎంత ఆసక్తికరంగా, ఉత్కంఠతో చూపించామన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. 'చీకటిలో' మూవీ కోసం దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఎంచుకున్న కథా వస్తువుకు పాడ్ కాస్ట్ అనే పాయింట్ జోడించి చెప్పడం కొత్తగా ఉంది. అలాగే చివరి వరకూ హంతకుడు ఎవరో తెలియకుండా సన్నివేశాలను రాసుకున్న తీరూ అలరిస్తుంది. అయితే, కథలో ఉన్న కీలక పాయింట్‌ను బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. పాతికేళ్ల కిందటి హత్యాచార ఘటనతో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఓ కైమ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుడు చూడబోతున్నాడనే హింట్ ఇచ్చేశాడు. టీవీ యాంకర్ నెల్లూరు సంధ్య నేపథ్యం, కుటుంబం, అమర్‌తో ప్రేమ ఇలా ఆమె ప్రపంచాన్ని పరిచయం చేస్తూ కాస్త నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే సంధ్య స్నేహితురాలు బాబీ హత్య జరుగుతుందో.. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ రాజీవ్ తో కలిసి సంధ్య సాగించే ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగుతుంది. ఇదే తరహాలో మరో జంట హత్యకు గురవడంతో కథ, కథనాలు ఆసక్తికరంగా మారతాయి. స్పెషల్ ఆఫీసర్ ఆనందిని (ఇషా చావ్లా) రంగ ప్రవేశంతో కథలో వేగం పెరుగుతుందని అనుకుంటే.. కొత్తదనమేమీ ఉండదు. సంధ్య ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, ఉన్నతాధికారులు సైతం ఆమెను ఫాలో అవ్వడం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. పైగా పోలీసులు పెట్టిన హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసి 'మరో హత్య చేసే లోపు నన్ను పట్టుకోండి' అంటూ హంతకుడే సవాల్ వినరడం కాస్త హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ హత్యల వెనుక కారణం అంత బలమైనదిగా అనిపించదు. నెల్లూరు సంధ్య పాత్రలో శోభిత ధూళిపాళ్ల న్యాయం చేశారు. చైతన్య, ఇషా చావ్లా, సురేశ్, రవీంద్ర విజయ్, శ్రీనివాస్ వడ్లమాని తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నిడివి కూడా తక్కువే. కథనం నెమ్మదిగా సాగినా.. కథను చివరి వరకూ ఆసక్తికరంగా చూపించడంలో శరణ్ కొప్పిశెట్టి విజయం సాధించారు.