సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం ఒకెత్తయితే, దానిని క్యాష్ చేసుకోవడం మరో ఎత్తు. అయితే, డబ్బు కోసం సినీ సెలబ్రిటీలు ఎంచుకుంటున్న కొన్ని మార్గాలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తన గ్లామర్ వీడియోల కోసం 'సబ్స్క్రిప్షన్' పద్ధతిని ప్రవేశపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆమెపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ఇలా వున్నాయి .. యాంకర్ విష్ణుప్రియ అంటే బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. తన చలాకీతనంతో అందరినీ ఆకట్టుకునే ఈ భామ, గత కొంతకాలంగా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్‌ను భారీగా పెంచేసింది. అయితే కేవలం ఫొటోలు, వీడియోలతో సరిపెట్టకుండా, తన గ్లామర్ ప్రదర్శనలను చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటూ ఇన్ స్టాగ్రామ్ లో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. గతంలోనే బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న ఈమె, ఇప్పుడు ఇలా నేరుగా తన ప్రైవేట్ వీడియోల కోసం నగదు వసూలు చేయడం నెటిజన్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విష్ణుప్రియ తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. శనివారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ ఆధ్వర్యంలో నాయకులు సూర్యరావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సెలబ్రిటీలు సమాజానికి ఆదర్శంగా ఉండాలి కానీ, ఇలా డబ్బుల కోసం కక్కుర్తి పడి యువతను పక్కదోవ పట్టించడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు, అశ్లీలతను ప్రోత్సహిస్తున్న ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాను వెంటనే బ్లాక్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.