భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్
ఢిల్లీ నుంచి నేరుగా ఎయిరిండియా విమానంలో భోగాపురం చేరుకున్న కేంద్ర మంత్రి
వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్ గా భోగాపురం మారుతుంది : రామ్మోహన్ నాయుడు
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా మరో కీలక మైలురాయి నమోదైంది. ఎయిర్ ఇండియా సహకారంతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల హర్షధ్వనాల మధ్య చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 96 శాతం వనులు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ ఫ్లైట్ వాలిడేషన్ ప్రక్రియ పూర్తయింది.కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సివిల్ ఏవియేషన్, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఢిల్లీ నుంచి నేరుగా ఆదివారం ఉదయం 11.00 గంటలకు ఎయిరిండియా విమానం ద్వారా భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన కార్యక్రమంలో అధికారులను, ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ కావడం ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని పేర్కొన్నారు. "ఫ్లైట్‌లో పైలట్ 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం' అని అనౌన్స్మెంట్ చేయడం ఎంతో భావోద్వేగపూరిత క్షణం. ఇది ఉత్తరాంధ్ర ప్రజల విజయంగా భావిస్తున్నాను" అని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజం వేసింది దూరదృష్టి కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మంత్రి గుర్తు చేశారు. 2016లో అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభించిందని తెలిపారు. ప్రభుత్వ మార్పుల కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, గత 18 నెలలుగా నిరంతర సమీక్షలతో ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువచ్చామని వివరించారు. డిసెంబర్ 2026కు లక్ష్యంగా నిర్ణయించిన పనులను ఆరు నెలల ముందుగానే పూర్తి చేస్తున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాలను శాసనంగా తీసుకుని ప్రతి నెలా సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ఈ స్థాయికి చేరుకోవడంలో జీఎంఆర్ గ్రూప్, ఎల్&టీ, డీజీసీఏ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని స్టేక్ హోల్డర్లు కీలక పాత్ర పోషించారని మంత్రి ప్రశంసించారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసి సహకరించిన స్థానిక రైతాంగానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం మరువలేనిదని, భోగాపురం ప్రాంతం రాబోయే రోజుల్లో వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చెందనుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు శంషాబాద్ విమానాశ్రయంపై వచ్చిన విమర్శలకు భోగాపురమే నమాధానమని వ్యాఖ్యానించిన మంత్రి, ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దిశ, దశ పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు. టూరిజం, వాణిజ్యం, కార్గో, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, విశాఖ ఎకనామిక్ రీజియస్ రోజురోజుకీ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. మరొక నాలుగు నుంచి ఐదు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని సాంకేతిక, నియంత్రణ ప్రక్రియలు పూర్తయ్యాయని, టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ అంటే ఎయిర్పోర్ట్ పనులు దాదాపు పూర్తైనట్టేనని స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయం ఒడిశా, రాయవూర్ ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగపడనుందని, అన్ని ప్రాంతాలకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ పాటు ఎం.ఆర్.వో.(మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్స్) సదుపాయాలు, ఏరో ఇండస్ట్రీస్, ఎడ్యుసిటీ ఏర్పాటు చేసి భోగాపురాన్ని ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది కానుందని, దిశదశగా నిలవనుందని, యువతకు విస్తృత ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నా రు. ఈ ప్రాజెక్టు కోసం రాత్రింబవళ్లు శ్రమించిన ఇంజినీ ర్లు, కార్మికులు, అధికారులు, సిబ్బందికి మంత్రి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రోడ్డు కనెక్టవిటీపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం
భోగాపురం ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే నాటికి రోడ్డు కనెక్టవిటీ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించామని, విశాఖపట్టణం నుంచి ఇక్కడకు సులభంగా చేరుకునేలా ఏడు రోడ్లతో కూడిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్టణం, మూలపేట పోర్టులకు కూడా దీనితో అనుసంధానం ఏర్పాటు చేస్తామని, అలాగే విశాఖ -రాయ్ పూర్ హైవేతో కనెక్టవిటీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమంలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు చేపట్టబోయే ఇతర ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. మెట్రోను కూడా త్వరలోనే పట్టాలెక్కిస్తామన్నారు. ఆనందపురం వద్ద కూడలిని విస్తరిస్తామని చెప్పారు. వైజాగ్ పోర్టు నుంచి భోగాపురం వరకు ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు. నాయుడు చర్చించారని గుర్తు చేశారు. ఫాస్ట్ ట్రాక్ మోడ్. లో అన్ని పనులు చేస్తున్నాం.
ముఖ్యమంత్రి దూరదృష్టితో ఇప్పటికే విశాఖ కేంద్రంగా వలు కంపెనీలు వచ్చాయని, 15 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో గూగుల్ వచ్చిందని ఇదొక మైలురాయని పేర్కొన్నారు. ఎం.ఆర్.వో. ఇండస్ట్రీస్ కార్యకలాపాల కోసం ప్రభుత్వం మరొక 500 ఎకరాలు కేటాయించామని, వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్డి భోగాపురానికి అనుసంధానంగా నెలకొల్పుతున్న ఎడ్యుసిటీ కోసం మాన్సాస్ సంస్థ 136 ఎకరాల భూమి ఉచితంగా కేటాయించిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, జీఎంఆర్ సంస్థ ఎయిర్‌పోర్టు బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ. ప్రభాకర్ రావులు మాట్లాడారు.. విశాఖపట్టణం, అనకాపల్లి ఎంపీలు శ్రీభరత్, సీఎం రమేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, రాం ప్రసాద్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు...