రూ.4.30 లక్షలతో పెరీరా ఫ్లావియా హేన్రిట్టాను సొంతం చేసుకున్న గోదావరి గోల్డెన్ ఈగల్స్
శ్రీ చరణి, సాయి షణ్ముఖప్రియను దక్కించుకున్న రాయలసీమ జెన్ స్టార్స్
191 మంది నమోదు.. 74 మంది ప్లేయర్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల క్రికెట్ లీగ్ డబ్ల్యూఏపీఎల్-2026 ఫ్రాంచైజీ విధానంలోని ఆక్షన్ మంగళవారం విజయవాడలోని నోవోటెల్ వేదికగా విజయవంతంగా ముగిసింది. మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం, మహిళా సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ఈ ఆక్షన్‌లో ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్లతో పాటు యువ క్రీడాకారిణులను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. డబ్ల్యూఏపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన క్రీడాకారిణిగా పెరీరా ఫ్లావియా హేన్రిట్టా నిలిచింది. ఆమెను గోదావరి గోల్డెన్ ఈగల్స్ రూ.4.30 లక్షలకు సొంతం చేసుకుంది. భారత స్టార్ ప్లేయర్ శ్రీ చరణిని రాయలసీమ జెన్ స్టార్స్ రూ.1.10 లక్షలకు దక్కించుకోగా.. కేవలం 12 ఏళ్ల వయనులో ఆక్షన్‌లో పాల్గొన్న ఏ. సాయి షణ్ముఖప్రియను కూడా రాయలసీమ జెన్ స్టార్స్ సొంతం చేసుకుంది. భారత జట్టు తరఫున రాణించిన కే. అంజలి శర్వాణిని వైజాగ్ ఫైర్ బర్డ్స్ కొనుగోలు చేయగా.. నీరగట్టు అనూషను అమరావతి ఈ ఛాంపియన్స్ రూ.2.10 లక్షలకు దక్కించుకుంది. మొత్తం 191 మంది క్రీడాకారిణులు డబ్ల్యూఏపీఎల్ కోసం నమోదు చేసుకోగా.. వారిలో 74 మందిని ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఆక్షన్‌లో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆక్షన్ అనంతరం గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర మహిళల క్రికెట్ చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజని అన్నారు. గతంలో టోర్నమెంట్ విధానంలో నిర్వహించిన డబ్ల్యూఏపీఎల్‌ను తొలిసారి ఫ్రాంచైజీ విధానంలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఫ్రాంచైజీ విధానంలో లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించగానే 11 జట్లు ఆసక్తి చూపగా.. వాటిలో నాలుగు ఫ్రాంచైజీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మహిళల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. మిథాలీ రాజ్ ఎలాంటి ఆశలు లేకుండా మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం ఆంధ్ర క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. శ్రీ చరణి మాదిరిగా మరెంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారిణులు డబ్ల్యూఏపీఎల్ నుంచి భారత జట్టుకు ఎదగాలని ఆకాంక్షించారు. క్షించారు. సెప్టెంబర్ 15 తర్వాత టోర్నమెంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, మంగళగిరి వేదికగా డే, నైట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. ఆక్షన్‌ను శ్వేతా బాల్ సమర్థంగా నిర్వహించారని అభినందించారు. కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, అపెక్స్ కమిటీ సభ్యులు, వివిధ ఫ్రాంచైజీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.