కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' ఆగస్టు 26 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హోమ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలువుకుని రూ. 50, అలాగే మల్టీప్లెక్స్‌లు మరియు స్పెషల్ థియేటర్లలో రూ.100 వరకు అదనంగా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు. పెంచిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి సెప్టెంబర్ 4 వరకు పది రోజుల పాటు అమలులో ఉంటాయి. అలాగే ఈ పది రోజుల పాటు రోజుకు అదనంగా ఒక షోతో కలుపుకుని మొత్తం 5 షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ధరల పెంపుతో పాటు మరికొన్ని కీలక నిబంధనలను కూడా ఖరారు చేసింది. సినీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్‌కు నిర్మాణ సంస్థ కేవీఎన్-మాస్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ' తక్షణమే రూ. 1 కోటి విరాళంగా అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధులను పూర్తిగా సినీ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయనున్నారు. అలాగే, సినిమా ప్రదర్శన సమయంలో మాదకద్రవ్యాలు, నార్కోటిక్స్ మరియు సైబర్ క్రైమ్ వల్ల కలిగే దుష్ప్ర్పభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే ప్రత్యేక ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని థియేటర్ల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలన్నీ ఎలాంటి లోపాలు లేకుండా కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు మరియు సినిమా లైసెన్సింగ్ అధికారులకు అప్పగించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. టాక్సిక్' చిత్రాన్ని తెలంగాణలో ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు, ఎఫ్.డి.సి. చైర్మన్ దిల్ రాజు విడుదల చేస్తున్నారు.