పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సీక్వెల్‌పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఓజీ2 కోసం ప్రీ-ప్రొడక్షన్ చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దర్శకుడు సుజీత్... పవన్ కు ఓజీ2 కథ వినిపించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇచ్చిన మాట ప్రకారం చర్చలు మొదలయ్యాయని, దర్శకుడు సుజీత్... పవన్ తో సమావేశంలో పాల్గొన్నారని వెల్లడించింది. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'దే కాల్ హిమ్ ఓజీ' (2025) చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజన్ తనకు ఎంతగానో నచ్చిందని, దీనిని ఒక యూనివర్స్ (సీక్వెల్స్, ప్రీక్వెల్స్) విస్తరించే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్రియేటివ్ వర్క్స్ కార్యాలయంలో దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు జరగడం ఓజీ2 ప్రాజెక్ట్‌పై కదలిక మొదలైందనడానికి సంకేతంగా నిలుస్తోంది. ఈ వార్త తెలియగానే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఓజీ2 హ్యాష్ ట్యాగ్ పోస్టులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.