ఘనంగా సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం
కోలాహలంగా పి. రమేష్‌బాబు జన్మదిన వేడుకలు
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్)గా కె.ఎస్.హెచ్.ఆర్.కె. ధర్మరాజు బాధ్యతల స్వీకారం
ప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం నవ్య గేయాలాపన
విశాఖపట్నం: ఒకే రోజు నాలుగు ప్రత్యేక వేడుకలకు సిటిజెన్ ఫోర్స్ వేదికగా నిలిచింది. సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ 14వ ఆవిర్భావ దినోత్సవం, సంస్థ వ్యవస్థాపకుడు పి. రమేష్ బాబు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విద్యాసంస్థల అధినేత కె.ఎన్.హెచ్.ఆర్.కె. ధర్మరాజు సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్)గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల భారత ప్రభుత్వం ఆమోదించిన వందేమాతరం నవ్య గేయాలాపన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందేమాతరం స్ఫూర్తిని అందిపుచ్చుకుని, సిటిజెన్ ఫోర్స్ లక్ష్యాలను అంకితభావంతో ముందుకు తీసుకెళ్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి ప్రొఫెసర్ వై. సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు పౌరులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా అవగాహన కల్పించడమే సిటిజెన్ ఫోర్స్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం, రమేష్‌బాబు జన్మదినం ఒకే రోజు రావడం విశేషమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సిటిజెన్ ఫోర్స్ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రొఫెసర్ అవధాని మాట్లాడుతూ, ప్రతి గొప్ప కార్యక్రమం చిన్న ఆరంభంతోనే ప్రారంభమవుతుందని అన్నారు. సిటిజెన్ ఫోర్స్ ఆవిర్భావ ఆలోచనను రమేష్‌బాబు వివరించినప్పుడు అది ఎంతో ఆదర్శవంతంగా అనిపించిందని చెప్పారు. సంస్థ భవిష్యత్ కార్యాచరణకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించి, తదుపరి తరాలకు సంస్థ లక్ష్యాలను అందించేలా కృషి చేయాలని సూచించారు. లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ మధుసూదనరావు మాట్లాడుతూ, సైబర్ భద్రతపై సిటిజెన్ ఫోర్స్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. మెరుగైన సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న రమేష్‌బాబును అభినందించారు. సిటిజెన్ ఫోర్స్ వ్యవస్థాపకులు పి. రమేష్ బాబు మాట్లాడుతూ, ఎలాంటి విరాళాలు సేకరించకుండా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. సమాజంలో ఎవరూ నిస్సహాయులుగా ఉండకూడదనే లక్ష్యంతో సంస్థను స్థాపించామని చెప్పారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని, ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా నిలిచేలా ఇటీవల ప్రముఖులతో నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సంస్థ లక్ష్యాలను తదుపరి తరాలకు తీసుకెళ్లేందుకు సమర్ధులైన మేధావులను సంస్థలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న ఆయన, విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ధర్మరాజును సంస్థలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉ ందన్నారు. అలాగే విలువలతో కూడిన విద్యను అందిస్తున్న మధుసూదనరావు సహకారం కూడా సంస్థకు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో కొత్త అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ధర్మరాజు నాయకత్వంలో డిజిటల్ యూనివర్సిటీ స్థావనకు కృషి చేస్తున్నామని, కృష్ణా జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయని రమేష్‌బాబు వెల్లడించారు. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్)గా బాధ్యతలు స్వీకరించిన ధర్మరాజు మాట్లాడుతూ, సిటిజెన్ ఫోర్స్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని, సంస్థ ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేస్తూ రమేష్‌బాబు ఆశయాలను భావితరాలకు చేరవేస్తానని అన్నారు. కార్యక్రమంలో సిటిజెన్ ఫోర్స్ ఫౌండింగ్ డైరెక్టర్ పి. ఉమామహేశ్వరి, ఫౌండర్స్ కెప్టెన్ వెంకట కృష్ణ చైతన్య, డాక్టర్ శ్రీ లలితా శివజ్యోతి, పీవీఎన్ రాజీవ్, డైరెక్టర్ ఎస్. పవన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.