ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయి
మరింత అప్రమత్తంగా ఉండండి
ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం
కులం, మతం రంగులు పులుముతూ ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నాయి
ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అర్జీలకు మానవీయ కోణంలో పరిష్కారం
ప్రజలతో సౌమ్యంగా మాట్లాడండి
అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం
రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందు కు ప్రయత్నిస్తున్నాయి. పలు సంఘటనలకు కులం, మతం రంగులు పులుముతూ ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నాయి. ఫేక్ ప్రచారాలతో అధికారులను, ఉద్యోగులను బద్నాం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై మరింత అప్రమత్తంగా ఉండాలి' అని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఇటీవల మానసిక సమస్యల కారణంగా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటువడి తప్పుదారి పడుతున్నారన్నారు. పాత కేసులను పరిష్కరిస్తున్నామని, 2019లో జరిగిన కొన్ని నేరాలను ట్రేస్ చేసి పట్టుకుంటున్నామని తెలిపారు. శిక్షలు కూడా పడుతున్నాయన్నారు. ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తప్పు చేసినవాడెవడూ తప్పించుకోలేడన్నారు. వాహనాల నంబరు ప్లేట్ల విషయంలో నిబంధనలు పక్కాగా పాటించాల్సిందేనని ఆదేశించారు. ప్రమాణాల ప్రకారమే వాహనదారులు నంబరు ప్లేట్లు అమర్చుకోవాలని స్పష్టం చేశారు. డిసెంబరు నెలలో క్వాంటం కంప్యూటర్ను ల్యాండ్ చేయాల్సి ఉందన్నారు. ఈలోపు క్వాంటం పార్కు సెమీ కండక్టర్ పార్కు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ, నదీ జలాల కాలుష్యం నుంచి కాపాడటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
పనితీరు ఆధారంగా బాధ్యతలు
ఉద్యోగులు, అధికారులు 'సాఫ్ట్ స్కిల్స్' నేర్చుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు వినూత్న ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తామని, పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. అర్జీదారుల తరఫున ఆలోచించి, సమస్యల పరిష్కారంపై ఆలోచనలు చేయాలని ఉద్యోలకు సూచించారు. పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, అధికారుల వద్దకు వచ్చేవారితో సౌమ్యంగా మాట్లాడాలని సూచించారు. తద్వారా పాలనపై ప్రజల్లో సానుకూలత వస్తుందన్నారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఉద్యోగులు పాలనావరంగా సామర్థ్యాలను పెంచుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానం మార్చుకోవాలని సీఎం సలహా ఇచ్చారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమివ్వాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే పాలనలో వాస్తవాలేమిటో తెలుస్తాయని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాలను నరిచేసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి బలమైన మానవ వనరుల వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. పాలనా సంస్కరణలపై ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇప్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. పాత రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ పెద్ద టాస్క్ ఉండేదని, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సులభమైందని అన్నారు. వినూత్న ఆలోచనలతోనే వ్యవస్థలు గాడిలో పడతాయన్నారు.
నేడు కేబినేట్ భేటీ
సచివాలయంలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగలశారం ఉ దయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉ ండగా, వీటి ద్వారా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 10 సంస్థల ఏర్పాటుకు కూడా ఏపి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక, కేబినెట్ అజెండా ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశర చేయనున్నట్లు తెలుస్తోంది.