ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 రసవత్తరంగా మారిపోయింది. లీగ్ దశ ఆఖరికి చేరుకున్నా. 10 జట్లకు కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉ న్నాయి. లక్నో, ముంబై జట్లకు కాస్త కష్టమైనా అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఇక ఆరంభంలో ఇబ్బంది పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం దూకుడు మీద ఉంది. ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ అవ్వడంతో పాటు నిలకడగా ఆడుతూ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 10 మ్యాచ్ ల్లో 5 విజయాలు.. 5 ఓటములతో 10 పాయింట్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో సంజూ సామ్సన్ రెచ్చిపోయాడు. తద్వారా ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ సామ్సన్ 52 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు.. 6 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తొలి సీజన్ ఆడుతున్న సంజూ సామ్సన్ ఆరంభంలో ఇబ్బంది పడ్డా.. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సంజూ సామ్సన్ నిలబడి ఆడిన ప్రతిసారి కూడా చెన్నై గెలవడం విశేషం. ఇక ఢిల్లీతో జరిగిన పోరులో కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి అజేయమైన 3వ వికెట్‌కు 66 బంతుల్లో 114 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ఒకే జట్టుపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా సంజూ సామ్సన్ చరిత్ర నెలకొల్పాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన తొలి అంచె పోరులో ఆయుశ్ మాత్రేతో కలిసి సంజూ సామ్సన్ 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఢిల్లీపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే అతడు రెండు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. సంజూ సామ్సన్‌లా ఒకే సీజన్లో సాధించలేదు. ఈ మ్యాచ్‌లో సంజూ సామ్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (24 బంతుల్లో 40 నాటౌట్; 4 సిక్సర్లు), ట్రిస్ట్రాన్ స్టబ్స్ (38) మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. నూర్ అహ్మద్‌కు 2 వికెట్లు లభించాయి. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), ఉర్విల్ పటేల్ (17)లు విఫలం అయినా సంజూ సామ్సన్, కార్తీక్ శర్మలు మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 8 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది.