ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని ఆయన ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ ప్రతులు, ప్రజల నిరసనలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చి, ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కాలేజీలు పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ప్రారంభించామన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా పేదల నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితి తీసుకొస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను వివరించామని చెప్పారు. ప్రజల నిరసనలు, ఆధారాలతో కూడిన సమాచారాన్ని గవర్నర్‌కు అందించామని తెలిపారు.
ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజలు జీవించలేరని జగన్ వ్యాఖ్యానించారు. వైద్య, విద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. అన్ని వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఒక స్పష్టమైన విజన్‌తోనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, అన్ని విభాగాల సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశామని చెప్పారు. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ చికిత్సలు అందేలా పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చామని పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడం అతిపెద్ద స్కాం అయితే, ఆ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో పెద్ద స్కాంగా అభివర్ణించారు. రూ.120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కోసం ఎలా వెచ్చిస్తారని ప్రశ్నించారు. కాలేజీలు ప్రైవేటు చేతుల్లో ఉండి, జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల సమీప ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే పరిస్థితి తగ్గిందన్నారు. ఈ వ్యవస్థను బలహీనపరిస్తే పేద ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.