ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం మన జీవితాల్లో ఒక భాగంగా మారిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్, కమ్యూనికేషన్, షాపింగ్ మొదలుకొని విద్య, ఉద్యోగాలకు సంబంధించి అన్నీ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న వేళ... ఈ సౌలభ్యం కొందరికి శాపంగా మారుతోంది. ప్రభుత్వాలు, సైబర్ క్రైమ్ విభాగాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త ఆన్లైన్ మోసం వార్తల్లోకి వస్తూనే ఉంది. అయినప్పటికీ కొంతమంది అప్రమత్తత లేకపోవడం వల్ల మోసగాళ్ల వలలో చిక్కిపోతున్నారు. తాజాగా ఇదే తరహాలో మంగళూరుకు చెందిన ఒక మహిళ రూ.61.15 లక్షల రూపాయలు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో పోగొట్టుకున్నారు.
స్కామ్ కథ ఇలా జరిగింది..
మంగళూరుకు చెందిన ఓ మహిళకు ఓ అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేస్తున్న వ్యక్తి తనను ముంబయి కొలాబా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సందీప్ అని చెప్పుకున్నాడు. ఆమె పాన్ కార్డు హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ కేసుల్లో ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. దీనితో ఆమెను తీవ్రమైన భయాందోళనకు గురి చేశారు.
తర్వాత ఆమెను వేరే వ్యక్తులతో మాట్లాడమని ఫోర్స్ చేశాడు. అందులో ఒకరు ‘ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మోహిత్ కుమార్’ అని తనను వాట్సాప్ వీడియో కాల్లో సంప్రదించాడు. ఈ కాల్లో ఆమెను ఎవరికీ – కుటుంబ సభ్యులకు కూడా – తెలియజేయవద్దని స్పష్టం చేయడం, లేదంటే ఆమె భర్తను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడం జరిగింది.
ఈ బెదిరింపులకు భయపడ్డ బాధితురాలు తన పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం అందించింది. దర్యాప్తు కోసం డబ్బులు బదిలీ చేయాలని వాటిని డిపాజిట్ గా ఉంచుతారని.. దర్యాప్తు పూర్తయిన తరువాత తిరిగి చెల్లిస్తామనీ నమ్మించారు. జూన్ 21 నుండి జూలై 9 మధ్య కాలంలో ఆమె RTGS ద్వారా అనేక ఎకౌంట్స్ లో మొత్తం రూ.61,15,050 బదిలీ చేసింది. తరువాత అనుమానం వచ్చిన ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించింది. అప్పుడు ఇది పెద్ద మోసం అని అర్ధం అయింది.
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏమిటి?
ఇది ఇటీవల పెరుగుతున్న ఓ మోసం. ఇందులో స్కామర్లు తాము పోలీస్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సభ్యులు అని చెప్పుకుంటారు. సీరియస్ క్రిమినల్ కేసుల పేరుతో బెదిరింపులు చేస్తారు. వాట్సాప్ వీడియో కాల్, ఇమెయిల్స్, నకిలీ ID కార్డులు వాడి బాధితులకు నమ్మకం కలిగిస్తారు. చివరికి 'ఇంట్రాగేషన్' అవసరమని, న్యాయపరంగా డిపాజిట్ లు కావాలంటూ డబ్బులు అడుగుతారు.
ఇలాంటి మోసాల నుంచి ఎలా కాపాడుకోవాలి?
- అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వండి.
- అధికారుల పేరుతో వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్‌కు తొందరపడి స్పందించకండి. జాగ్రత్తగా పరిశీలించండి. అనుమానం వస్తే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.
- అప్పటికప్పుడు డబ్బు ఏదైనా పర్సనల్ ఎకౌంట్ కు పంపించమంటే ఒప్పుకోకండి. ప్రభుత్వ సంస్థలు RTGS లేదా పర్సనల్ ఎకౌంట్స్ కు డబ్బులు పంపించాలని అడగవు.
- ఫోన్ కాల్ రికార్డ్ చేయండి. ఇది తరువాత ఫిర్యాదులో ఉపయోగపడుతుంది.
- తప్పనిసరిగా నమ్మదగిన అధికారిక వెబ్సైట్లను చెక్ చేయండి. సంబంధిత విభాగాన్ని నేరుగా సంప్రదించండి.
ప్రభుత్వం సూచనలు
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ (CERT-IN), పోలీస్ శాఖలు, డిజిటల్ ఇండియా ప్లాట్‌ఫారాలు నిరంతరం అవగాహన కల్పిస్తున్నాయి. అయినా సరే, అవగాహనతో పాటు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకం. ప్రతి ఒక్కరు 1930 టోల్‌ఫ్రీ నెంబర్, www.cybercrime.gov.in లాంటి వెబ్సైట్ల గురించి తెలుసుకోవాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వీటి ద్వారా అధికారులను సంప్రదించాలి.
డిజిటల్ యుగంలో ముందడుగు వేయాలంటే టెక్నాలజీని ఉపయోగించుకోవడం తప్పదు. కానీ అదే టెక్నాలజీ మనపై తిరగకూడదంటే అప్రమత్తత అవసరం. వాస్తవికంగా తేలే అధికారిక సమాచారం లేకుండా ఎవరి మాటలు నమ్మకండి. ఆన్లైన్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి. జాగ్రత్తే జయమని గుర్తుంచుకోండి.