కలిసి పోటీ చేశారు.. సమిష్టిగా ఘనవిజయం సాధించారు.. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతవరకూ చాలా బావుంది. మరి ఏడాది తరువాత ఇప్పుడు కలిసి ముందుకు నడుస్తున్నారా? ఏపీ కూటమి విషయంలో ప్రస్తుతం ఈ డౌట్ ఎవరికైనా రాకపోతే తప్పే అనిపించేలా పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మొదటి ధ్యేయంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డారు గత ఎన్నికల ముందు. ఆ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డిని తూర్పారపెట్టడమే పనిగా పెట్టుకుని.. అలవికాని ఎన్నో హామీలను కుమ్మరించి దాదాపుగా 97 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది కూటమి. ఏడాది అయింది. ఆ హామీల గురించి పక్కన పెడితే.. రాజకీయంగా మూడు పార్టీలు ఒకే తాటిమీద ఉన్నాయా? ఈ ప్రశ్నకు లేవనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే, టీడీపీ-జనసేన లోపల లుకలుకలు ఎలా ఉన్నా.. నాయకత్వం మేమంతా ఒకటే అనే సందేశాన్నిచ్చేలా నడుచుకుంటోంది. కానీ.. ఎటొచ్చి కూటమిలో కీలక పక్షం.. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ పద్ధతే కాస్త తేడా కొడుతోందని అనిపిస్తోంది. ఎందుకంటే, టీడీపీ-జనసేన అడుగడుగునా వైసీపీ పై ఎదో ఒక ఆరోపణలు.. కేసులు.. రకరకాలుగా మాటల దాడులు చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కానీ,, ముఖ్యమైన మూడో పక్షం బీజేపీ నుంచి మాత్రం ఒక్క చిన్న మాట కూడా బయటపడటం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనడం లేదు. ఎంత పెద్ద ఇష్యు జగన్ తరఫున బయటకు వచ్చినా.. బీజేపీ పెద్దలు మాత్రం కిమ్మనడం లేదు. రాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి కేంద్ర పెద్దల వరకూ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక్క మాట కూడా జారడం లేదు. ఇది దేనికి సంకేతం?
సాధారణంగా ఎక్కడైనా అధికార ప్రతిపక్షాల మధ్య ఎప్పుడూ రాజకీయ వైరం గట్టిగానే ఉంటుంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయం అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు రెండో పార్టీ నాయకులను కేసుల పేరుతొ వేధించడం పరిపాటిగా మారిపోయింది. అవి వేధింపులా.. నిజాలా అనేవి ఎప్పటికీ తేలదు. ప్రజలకు నిజం అర్ధం అయ్యే ఛాన్స్ అసలు లేదు. ఇది పక్కన పెడితే ప్రతిపక్షం ఎంతగా అధికార పక్షాన్ని నిలదీస్తుందో.. దానికి అంతే ధీటుగా అధికారంలో ఉన్నవారు కూడా సమాధానం చెబుతారు. చెప్పాలి కూడా. ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంపై ఎంతగా విరుచుకు పడుతున్నా.. టీడీపీ - జనసేన మాత్రమే రెస్పాండ్ అవుతున్నాయి. జగన్ పర్యటనల విషయంలో విమర్శలు కుప్పిస్తున్నాయి. ఇటీవల జగన్ పర్యటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సందర్భం తెలిసిందే. దీనిలో స్వయంగా జగన్ ఉన్న కారు కిందే ఒక వ్యక్తి పడి చనిపోయాడు అంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో పెద్ద రచ్చ.. చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. వైసీపీ దీనిపై గట్టిగానే ఎదురుదాడికి దిగింది. ఆ దాడిని తిప్పికొట్టడానికి టీడీపీ-జనసేన నాయకులు విపరీతంగా కష్టపడుతున్నారు. కానీ, బీజేపీ నుంచి ఈ విషయంపై కనీస స్పందన కనిపించలేదు. రాష్ట్ర స్థాయిలో పురందేశ్వరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా చాలామంది జగన్ ని వ్యతిరేకించే వారు ఉన్నారు. కానీ, వారిలో ఒక్కరు కూడా వైసీపీ విషయంలో లేదా జగన్మోహన్ రెడ్డి విషయంలో కిమ్మనడం లేదు. రాష్ట్రంలోనే ఇలా ఉంటే.. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ నాయకులు ఎవరూ నోరు మెదపడం లేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడిన బీజేపీ నేతలు అధికారం వచ్చాకా సైలెంట్ అవడానికి కారణాలు ఏమిటి? రాజకీయ పరిశీలకులు దీనికి రెండు కారణాలను చెబుతున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో వస్తున్న జన స్పందన. రెండోది బీజేపీ కేంద్ర నాయకత్వం అందుకున్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్. జగన్ కాలు బయటపెడితే చాలు వేలాదిగా జనం వెర్రిగా వెనుక వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి పెరిగిందని బీజేపీ నాయకత్వం భావిస్తుండవచ్చు. అందుకే ఇంటిలిజెన్స్ సర్వే రిపోర్ట్ తీసుకుని ఉండవచ్చు. ఆ సర్వే లో షాకింగ్ విషయాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదని సర్వే చెప్పినట్లుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆ రిపోర్ట్ చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలని బీజేపీ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే, బీజేపీకి కేంద్రంలో అధికారం ముఖ్యం. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తే వారితోనే ముందడుగు వేస్తుంది. రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా మోహామాటాలు ఏమీ ఉండవు. గెలుపు గుర్రమే వారికీ కావలసింది. ప్రజలు ఎటువైపు ఊగుతున్నారో అదే ప్రధానం. దానికోసం కాంగ్రెస్ తప్ప ఎవరి తోనైనా చేతులు కలుపుతుంది. నిన్నటి వరకూ బద్ధ శత్రువు అని చెప్పినా.. తెల్లారేసరికి మా మిత్రుడు అని నిర్మొహమాటంగా చెప్పడంలో బీజేపీ రాజకీయమే సపరేటు. బీహార్ నితీష్ కుమార్ వ్యవహారమే దానికి పెద్ద ఉదాహరణ.
మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం బీజేపీ వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోంది. ఏపీలో అధికారంలో ఉంది కనుక.. తన తరఫు నుంచి సహాయం ఇవ్వడం తప్పనిసరి కాబట్టి వాటిని అందిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఈ ఐదేళ్లు కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ అవసరం. కానీ, రాజకీయంగా మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తోంది. అందుకు సాక్ష్యంగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనల్లో ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ జగన్ లేదా వైసీపీ ఊసే ఎత్తలేదని పరిశీలకులు అంటున్నారు.
ఏదిఏమైనా ఏపీ రాజకీయాలు మాత్రం దేశవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది థ్రిల్లర్ సినిమా కథనంలానే సస్పెన్స్. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఎలాంటి ట్విస్ట్ అయినా రావచ్చు. అది ఈ ఏడాదా? మరో ఏడాదా? ఎన్నికలకు ముందా అనేదే వేచిచూడాల్సి విషయం.