ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం పుణ్య స్నానాలకు 10 కోట్ల మంది వస్తారని అంచనాలు ఆరు జిల్లాల్లో కొత్తగా 237 ఘాట్లు నిర్మించాలని ప్రతిపాదనలు త్వరలో పుష్కర లోగో విడుదల.. విస్తృతంగా ప్రచారం గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా... మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణపై మంత్రుల కమిటీ, వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సమీక్షలో సీఎం వెల్లడించారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు రహదారిని అఖండ గోదావరిగా అభివృద్ధి చేయాలన్నారు. కేవలం పుష్కరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనులు పరిమితం చేయకుండా, ఇప్పుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలన్నారు. పుష్కరాల నిర్వహణతో రాజమహేంద్రవరం మహా నగరంగా అభివృద్ధి చెందాలని సీఎం చెప్పారు. హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్, రైల్వే ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీపైనా దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం, ఎవరికీ ఎలాంటి గందరగోళం లేకుండా పుష్కర ఘాట్లకు నెంబరింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల అనుసంధానం, విశాఖ నుంచి విజయవాడ వరకూ రైలు సర్వీసులు పెంచడం జరగాలని సీఎం నిర్దేశించారు. ప్రత్యేక రైళ్ల గురించి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాయడంతో పాటు, గోదావరి పుష్కరాలకు కేంద్ర సాయాన్ని కోరాలన్నారు. పర్యాటకుల సౌకర్యం కోసం కుంభమేళా తరహాలో టెంట్ సిటీలను, హోం స్టేలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. గోదావరి పుష్కరాలను అభివృద్ధికి అద్భుతమైన అవకాశంగా చూడాలన్నారు. ఉ ప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల పుష్కర పనుల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇరువైపులా రహదారులు నిర్మించడంతో పాటు, గోదావరి గట్టు బ్యూటిఫికేషన్ చేయాలని సీఎం సూచించారు. రాజమహేంద్రవరంలోని వీరేశలింగం పంతులు ఇంటిని కూడా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రముఖ్య ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, రాజకీయవేత్తలు, సినిమా సెలబ్రిటీలను కూడా గోదావరి పుష్కరాలకు ఆహ్వానించాలన్నారు. జూన్ 24న యాక్షన్ ప్లాన్‌తో రావాలని, అప్పటి నుంచి పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలవుతుందని సీఎం చెప్పారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆర్టీజీ, టీటీడీ సంయుక్తంగా రద్దీ నిర్వహణ ప్రక్రియను చేపట్టాలన్నారు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని చెప్పారు. అలాగే గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి రెండూ నిరాటంకంగా జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 మాట్లతో సహా కొత్తగా 237 మాట్లను నిర్మించాలని ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల మేర పొడవైన పుష్కర ఘాట్లను 9.9 కిలోమీటర్ల మేర పెంచాలని నిర్ణయించారు. పోలవరం జిల్లా గుండాలలో మొదటి ఘాట్... కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమగోదావరిలోని నర్సాపురంలో చివరి ఘాట్ నిర్మించ తలపెట్టారు. ఈసారి పుష్కరాల్లో పుణ్య స్నానాల కోసం 9.95 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991లో 1.2 కోట్ల మంది భక్తుల పుష్కర స్నానాలు చేయగా, 2003లో 5 కోట్ల మంది, 2015లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది భక్తుల పుష్కర స్నానాలు చేశారు. గత పుష్కరాల్లో ఒక్క రోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది భక్తుల పుష్కర స్నానం చేయగా, ఈసారి ఒక్క రోజులో 1 కోటి మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ.211.97 కోట్లకు సంబంధించి 132 పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సమీక్షకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, పి. నారాయణ, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ జి. సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, దేవదాయ, వైద్యారోగ్యం, రవాణా, పర్యాటక, పురపాలక, పంచాయితీరాజ్, ఆర్థిక, జలవనరులు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.