పర్యాటక నగరమైన విశాఖపట్నంలో కొత్త ఆకర్షణగా నిలిచే కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోనే అతిపొడవైనదిగా గుర్తింపొందింది. ఈ ప్రత్యేక నిర్మాణాన్ని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్లు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీస్తూ వచ్చే గాలులను తట్టుకునే సామర్థ్యంతో ఈ వంతెనను రూపొందించారు. 40 ఎంఎం మందం గల జర్మన్ తయారీ గాజుతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ 500 టన్నుల బరువును మోయగలదు. తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇప్పటికే ఈ వంతెనను చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ గాజు వంతెనపై నడుస్తూ గాల్లో తేలియాడుతున్న అనుభూతితో కైలాసగిరి కొండల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే అనుభవం పర్యాటకులకు కొత్త ఉత్సాహం కలిగిస్తోంది. నగరంలో టూరిజం రంగాభివృద్ధికి ఈ గ్లాస్ బ్రిడ్జ్ కొత్త అధ్యాయానికి నాంది పలికిందని అధికారులు తెలిపారు.
దేశంలో ఇప్పటివరకూ కేరళలోని 40 మీటర్ల గాజు వంతెన పొడవైనదిగా ఉండేది. ఇప్పుడు 50 మీటర్ల పొడవుతో కైలాసగిరి గాజు వంతెన ఆ రికార్డును బ్రేక్ చేసింది. వీఎంఆర్డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ. 7 కోట్లతో నిర్మించిన ఈ వంతెన ప్రారంభం కావడంతో వైజాగ్ వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతి సొంతం కానుంది . ఈ బ్రిడ్జి ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ప్రణవ్‌గోపాల్.. వీఎంఆర్డీఏ ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.