సినిమా విడుదలకు కొన్ని రోజులు లేదా వారం ముందు అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమవడం మనకు బాగా తెలిసిన విషయమే. కానీ, హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తీస్తున్న తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ మాత్రం ఈ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక సంవత్సరం టైమ్ ఉంది. అయినా.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఇది నోలన్పై ప్రేక్షకుల్లో ఉన్న భారీ నమ్మకానికి నిదర్శనంగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా టికెట్లు IMAX 70mm స్క్రీన్లకే పరిమితంగా అందుబాటులో ఉన్నాయి. క్రిస్టోఫర్ నోలన్ స్వయంగా ఈ సినిమాను IMAX 70mm కెమెరాలతో, ఫిల్మ్ రీల్స్ పై షూట్ చేస్తున్నారు. ఇది ప్రేక్షకులకు విభిన్నమైన థియేట్రికల్ అనుభూతిని అందించనుంది.
ఈ సినిమా కథా నేపథ్యం ప్రాచీన గ్రీకు రచయిత హోమర్ రాసిన “ది ఒడిస్సీ” పైన ఆధారపడింది. క్రీస్తుపూర్వం 700 ప్రాంతంలో వెలువడిన ఈ ఇతిహాస గాథను ఆధునిక టెక్నాలజీతో సినిమాగా మలిచేందుకు నోలన్ సిద్ధమయ్యారు.
ఈ సినిమాలో హాలీవుడ్ ప్రముఖులు మాట్ డామన్, టామ్ హాలండ్, జెండయా, అన్నా హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా 2026 జూలైలో విడుదల కానుంది. ఇప్పటి నుంచే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
నోలన్ గత చిత్రాలు ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, టెనెట్, ఒపెన్హైమర్లు గ్లోబల్గా ఎంతగా ప్రభావం చూపించాయో తెలిసిందే. అందుకే ఆయన తదుపరి చిత్రం ‘ది ఒడిస్సీ’పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఒక సంవత్సరం ముందే బుకింగ్లు ప్రారంభమవడం ద్వారా ఈ చిత్రం హాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించనుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా పై పెద్ద అంచనాలే ఉన్నాయి. ప్రేక్షకుల్లో ఈ మూవీ మీద ఎంత ఇంట్రస్ట్ ఉందనేది సంవత్సరం ముందుగా అడ్వాన్స్ లో టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోవడం రుజువు చేస్తోంది.