తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలోకూడా సంవత్సరం పొడవునా ప్రత్యేకంగా దేవస్థాన క్యాలెండర్ ప్రకారం అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూన్ 20 నుంచి జూలై 02వ తేదీవరకూ శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలను టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహించబోతోంది.
సాక్షాత్కార వైభవోత్సవాల కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి
జూన్ 26వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం ఉంటుంది. ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7గంటల నుండి 11:30గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భకులకు మధ్యాహ్నం 12:30గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
జూన్ 30వ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్వామి వారికి స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ రాత్రి 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు పెద్దశేష వాహనం పైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఊరేగిస్తారు.
జులై 1న ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటల నుండి 6 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించి, ఆపై హనుమంత వాహనం పైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊరేగింపు నిర్వహిస్తారు.
జులై 2న ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ నిర్వహించి ఆపై సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఏడు గంటల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణ గా అలంకార మండపంలోకి తీసుకొస్తారు. రాత్రి 7 గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో గరుడ వాహనం పైన విహరించి స్వామి భక్తులను కటాక్షిస్తాడు.
జులై 3న పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేను ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర నిర్వహించి అనంతరం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులను పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఆపై ఉదయం 11 గంటల నుండి రెండు గంటల మధ్య పార్వేట ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
పలు సేవలు రద్దు
శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్న క్రమంలో జూన్ 30 నుండి జూలై మూడవ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవాన్ని రద్దు చేశారు. జూన్ 26వ తేదీ నుండి జూలై మూడవ తేదీ వరకు తిరుప్పావడ సేవ, జూన్ రెండవ తేదీన అష్టోత్తర శత కలశాభిషేకం సేవలను రద్దు చేశారు .జులై 1వ తేదీన స్వర్ణ పుష్పార్చన ను రద్దు చేశారు.