"నక్క తోక తొక్కడం అంటే ఇదే!" అన్న నానుడి నిజం చేసుకున్నాడు పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లాకు చెందిన జాస్మాయిల్ సింగ్ అనే ఓ సాధారణ ఉద్యోగి. కేవలం రూ.6 పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌తో ఏకంగా రూ.1 కోటి గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోయాడు.
జాస్మాయిల్ సింగ్ ఇటుక బట్టీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి. ఇటీవల ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జిరా ప్రాంతానికి వెళ్లిన సమయంలో, లక్కీ డిప్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే, కొన్ని గంటల తర్వాత అతనికి వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో అతని జీవితమే మారిపోయింది. “శర్మ జీ ఫోన్ చేసి, ‘మీ నంబర్‌ను చెక్ చేయండి, మీరు కోటి రూపాయలు గెలిచారు’ అని చెప్పారు. నేను నమ్మలేకపోయాను,” అంటూ తన భావోద్వేగాన్ని జాస్మాయిల్ మీడియాతో పంచుకున్నాడు.
విజేత టికెట్ మధ్యాహ్నం 1 గంట సమయంలో డ్రా అయిందని అధికారులు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే, జాస్మాయిల్ కుటుంబం తమ గ్రామంలో స్వీట్లు పంచుతూ, డ్రమ్స్ వాయిస్తూ, నృత్యాలతో సంబరాల్లో మునిగిపోయింది. “ఈ డబ్బుతో నేను రూ.25 లక్షల నా అప్పు తీర్చుకుంటాను. మిగిలినదాన్ని పిల్లల భవిష్యత్ కోసం వినియోగిస్తాను” అని తెలిపారు.
జాస్మాయిల్ భార్య వీర్పాల్ కౌర్ మాట్లాడుతూ – “ఇలాంటి రోజు మాకు కలలో కూడా రాలేదు. ఇప్పుడు మా పిల్లలకు మంచి జీవితం ఇవ్వగలమన్న ఆశ కలిగింది” అని అన్నారు.
గమనించదగిన విషయం ఏమిటంటే, ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఇదే విధంగా ఇప్పటివరకూ నలుగురు సాధారణ వ్యక్తులకు భారీ లాటరీ బహుమట్లు దక్కాయి. ఈ విషయాన్నీ స్థానిక వ్యాపారులు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలో సాధారణ వ్యక్తులకు లాటరీ టికెట్ ఒక ఆదాయాన్ని అదృష్టాన్ని తెచ్చిపెట్టే వనరుగా మారింది. అందరూ తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో బిజీ అయిపోయారు.