నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను ఒక రోజు ముందుగానే, అంటే డిసెంబర్ 31, 2025న పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పెన్షన్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 63.12 లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.2,743.99 కోట్లను ప్రభుత్వం ఈ నెల పెన్షన్ల కోసం కేటాయించిందని మంత్రి వివరించారు. నూతన సంవత్సరాన్ని ఆర్థిక భద్రతతో ప్రారంభించాలన్న ఉద్దేశంతోనే ఈ ముందస్తు పంపిణీ చేపట్టామని చెప్పారు. డిసెంబర్ 31న ఏవైనా కారణాల వల్ల పెన్షన్ అందని లబ్ధిదారులకు జనవరి 2, 2026న మళ్లీ సచివాలయ సిబ్బంది ఇంటివద్దనే పంపిణీ చేస్తారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవల సోషల్ మీడియాలో పెన్షన్లు తగ్గించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది. పెన్షన్లలో ఎలాంటి కోతలు లేవని, దేశంలోనే అత్యధికంగా సామాజిక భద్రతా పెన్షన్లకు నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రభుత్వం పేర్కొంది. ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి రూ.2,739 కోట్లను పెన్షన్ల రూపంలో అందించినట్లు ఫ్యాక్ట్ చెక్ టీమ్ వెల్లడించింది.
అలాగే, వివిధ కారణాల వల్ల గత రెండు నెలలుగా పెన్షన్ తీసుకోలేని 1,39,677 మందికి రెండు నెలల పెన్షన్ కలిపి రూ.114 కోట్లు, మూడు నెలలుగా పెన్షన్ అందని 13,325 మందికి రూ.16 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేసింది.
సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని, ఇలాంటి దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ విజ్ఞప్తి చేసింది. కొత్త ఏడాది సందర్భంగా ముందస్తుగా పెన్షన్లు అందించడం ద్వారా పేదలు, వృద్ధులు, వికలాంగులు ఆర్థికంగా భద్రతగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.