యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష వ్యవహారం తాజా మలుపు తిరిగింది. 2017లో తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిమిషాపై ఆరోపణలు నమోదయ్యాయి. తలాల్ తన పాస్‌పోర్టును పట్టేసి దోపిడీ చేశాడని, అది తిరిగి పొందేందుకు ఇచ్చిన మత్తు మందు మోతాదు అధికంగా ఉండటంతో అతను మృతి చెందాడని నిమిషా పేర్కొంది. అయితే ఈ వివరణ బాధితుడి కుటుంబాన్ని మెప్పించలేదు.
నిమిషా ప్రియ కుటుంబం బాధితుడి కుటుంబానికి క్షమాపణగా సుమారు రూ. 8.6 కోట్ల (1 మిలియన్ డాలర్లు) బ్లడ్‌మనీ చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. కానీ తలాల్ కుటుంబం ఈ ఆఫర్‌ను ఖండించింది. "డబ్బుతో ప్రాణం విలువ తేల్చలేం" అని వారు స్పష్టం చేశారు. నేరానికి క్షమాపణ ఉండదని, న్యాయం జరగాల్సిందేనని బాధితుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది తెలిపారు.
ఈ పరిస్థితుల్లో కేరళ మతపెద్ద అబూబాకర్ ముస్లియార్ జోక్యం వల్ల నిమిషాకు మొన్న అమలుకావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం హూతీ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ యాక్షన్ కౌన్సిల్ తరఫున కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని సభ్యుడు దినేష్ నాయర్ తెలిపారు. "బాధితుల కుటుంబంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ వారు బ్లడ్‌మనీ తీసుకునేందుకు అంగీకరించడం లేదు" అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై తీవ్ర దృష్టి పెట్టింది. యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయంతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. అయితే, సుప్రీంకోర్టుకు కూడా ఈ అంశంపై నివేదిక సమర్పించామని, ఇప్పుడు బాధిత కుటుంబం నిర్ణయమే కీలకమని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం నిమిషా ప్రియ జీవితం – ఉరి లేదా విముక్తి – బాధిత కుటుంబం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. మతపెద్దల చర్చలు, కేంద్రం చొరవ, కౌన్సిల్ కృషి ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి. ఈ ఉదంతం అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల హక్కులపై మరోసారి చర్చకు తావిస్తుంది.