భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో సగటున 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ కీలక వివరాలను సభకు తెలియజేశారు.
గడ్కరీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారిలో 66 శాతం మంది యువతే కావడం ఆందోళనకర అంశంగా మారింది. ముఖ్యంగా 18 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల యువకులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ఇది దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అంశమని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడం, జరిమానాలు పెంచడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నప్పటికీ, రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను పూర్తిగా తగ్గించడంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయామని గడ్కరీ అంగీకరించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రమాదాల తర్వాత వెంటనే చికిత్స అందకపోవడం కూడా అనేక మరణాలకు కారణమవుతోందని గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్స్‌లను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలానికి 10 నిమిషాల్లోపు అంబులెన్స్ చేరుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నిర్వహించిన అధ్యయనాన్ని ఉదహరిస్తూ, గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందితే ఏటా సుమారు 50 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. అందుకే ఎమర్జెన్సీ స్పందన వ్యవస్థను మెరుగుపరచడం అత్యంత కీలకమని చెప్పారు.
అదే సమయంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను పాటించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న అంశాల్లో కఠినంగా వ్యవహరించాల్సి ఉందని అన్నారు.