మోసం చేయడానికి ఒక్కోరు ఒక్కో పని చేస్తారు. కొంతమంది రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసాలు చేస్తుంటారు. లేని భూమిని ఉందని చెప్పి.. ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలు చూపించి ఇలా ఎన్నో రకాలుగా మోసం చేస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక మోసం సంచలనంగా మారింది. ఒక తల్లీ, కొడుకు కలిసి లోకల్ అథారిటీలతో కలిసి ఏకంగా ఎయిర్ ఫోర్స్ రన్ వే అమ్మేశారు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ దగ్గరలోని ఫట్టూవాలా అనే గ్రామంలో ఒక ఎయిర్ ఫోర్స్ రన్ వే ఉంది. ఈ గ్రామం పాకిస్థాన్ కు అత్యంత దగ్గరలో ఉంటుంది. ఈ రన్ వే 1962లో జరిగిన చైనా యుద్ధం, 1965, 1971 పాకిస్థాన్ యుద్ధాలలో ఎయిర్ ఫోర్స్ విమానాలకు ఎంతో ఉపయోగపడింది. అప్పుడు యుద్ధాలలో ఈ రన్ వే కీలకంగా ఉండేది. తరువాతి కాలంలో ఇది ఉపయోగంలో లేకుండా ఉండిపోయింది. దీనిని గమనించిన దుమిని వాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాల్, ఆమె కుమారుడు నవీన్ చంద్‌లు దానిని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. స్థానిక అధికారులతో కథ నడిపించారు. వారితో కుమ్మక్కయి ఆ రన్ వే స్థలాన్ని తమ పేరుపై తప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేశారు. ఆ తరువాత 1997లో వేరే వారికి దానిని అమ్మేశారు. అప్పట్లోనే దీనిని గమనించిన ఒక రిటైర్డ్ రెవేన్యూ ఉద్యోగి నిషాన్ సింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ, దానిని ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోలేదు. అయితే, 2021లో హల్వార ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కమాండెంట్, ఫిరోజ్‌పుర్ కమిషనర్‌కు దీనిపై ఒక లెటర్ రాశారు. అయినా దీనిపై చర్యలు లేవు. దీంతో విసిగిపోయిన ఆయన చివరకు దర్యాప్తునకు ఆదేశాలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు మొదలైంది. ఈ దర్యాప్తులో 1997లో అనేకమంది పేర్లపై ఈ భూమి సేల్ డీడ్స్ జరిగినట్టు తేలింది. కానీ, ఎక్కడా ఎయిర్ ఫోర్స్ ప్రస్తావన ఆ డాక్యుమెంట్స్ లో లేదు. దీంతో హైకోర్టు దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ని ఆదేశించింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. అసలు విషయాన్ని బయటకు లాగారు. ఈ భూమిని రెండో ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1945 మార్చి 12న తీసుకొన్నట్లు విజిలెన్స్ బ్యూరో దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలోనే ఉన్నట్లు స్పష్టమైంది. తరువాత 1997లో దొంగ పత్రాలు సృష్టించినట్లు తేలింది. దీంతో నిందితులు ఉషా, నవీన్‌చంద్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు.